కార్పొరేట్లకు అలా.. ఎస్సీ, ఎస్టీలకు ఇలా! | SC and ST entrepreneurs furious over the government's stance | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు అలా.. ఎస్సీ, ఎస్టీలకు ఇలా!

Oct 14 2026 5:39 AM | Updated on Oct 14 2026 5:39 AM

SC and ST entrepreneurs furious over the government's stance

కేటాయించిన ప్లాట్లు వెనక్కి తీసుకుంటామంటూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నోటీసులు

సకాలంలో డబ్బు చెల్లించలేదంటూ 1,600 మందికి నోటీసులు 

రాయితీలు ఇస్తే వెంటనే చెల్లిస్తామంటున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు 

లేకపోతే గడువు పెంచాలని విజ్ఞప్తి 

కార్పొరేట్లు డబ్బు చెల్లించకపోయినా గడువు ఇస్తున్న ప్రభుత్వం 

కారుచౌకగా భూములిచ్చినా డబ్బులు చెల్లించడానికి కార్పొరేట్లకు అదనపు సమయం  

ఆర్సలర్‌ మిట్టల్, సత్వా, రేమాండ్‌ వంటి కంపెనీలకు గడువు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం 

ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దళిత పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు సర్కారు సవతి తల్లి ప్రేమను మరోసారి చూపించింది. ఇప్పటివరకు పారిశ్రామిక రాయితీలు పూర్తిగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేసింది. సకాలంలో నగదు చెల్లించలేదంటూ 1,600 మందికిపైగా దళిత పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వారిలో 1,200 మంది ప్లాట్లను రద్దు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దళిత పారిశ్రామిక సంఘాలు వాపోతున్నాయి.

ఒకపక్క కార్పొరేట్‌ సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా అప్పగించినా సకాలంలో డబ్బులు కట్టకపోతే మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై వారికి గడువు పెంచుతున్నాయని, అదే ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు చెల్లించకుండా ప్లాట్లకు డబ్బులు కట్టలేదంటూ ఇలా నోటీసులు జారీచేసి రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 11న నోటీసులు జారీచేసి అక్టోబర్‌ 10లోగా కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

రాష్ట్రంలో బడా పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే ఎకారాలకు ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఎంఎస్‌ఎంఈలకు మాత్రం మార్కెట్‌ రేటు కంటే మూడు రెట్లు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం కేటాయించిన భూములపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోతుంటే దళిత పారిశ్రామికవేత్తలు కష్టపడి బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్‌ తెచ్చుకొని పరిశ్రమలు పెట్టే సమయానికి కుంటి సాకులు చెప్పి ఏపీఐఐసీ ఆ భూములు లాక్కోవడాన్ని వీరు తప్పు పడుతున్నారు.  

కార్పొరేట్లకు కంచాల్లో.. 
రూ.వేల కోట్ల విలువైన భూమలు తీసుకున్న ఆర్సలర్‌ మిట్టల్, బెంగళూరుకు చెందిన సత్వా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై వాటికి గడువు పెంచిన విషయాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేస్తున్నారు. రూ.లక్ష కోట్లతో రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి 2,080.76 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇందుకు చెల్లించాల్సిన రూ.1,069 కోట్లు తమ దగ్గర లేవని.. మూడు విడతల్లో చెల్లిస్తామని ఆర్సలర్‌ మిట్టల్‌ లేఖ రాయగానే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మరీ ఆమోదించిందంటున్నారు.

అలాగే బెంగళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కారుచౌకగా రూ.45 కోట్లకే చంద్రబాబు సర్కారు కేటాయిస్తే.. ఈ మొత్తం చెల్లించడానికి డబ్బులు లేవంటే ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించేందుకు 60 రోజులు గడువు  ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలే కాదు లులు, రేమాండ్, సిఫి ఇన్ఫినిటీ వంటి అనేక కార్పొరేట్‌ కంపెనీలకు డబ్బులు చెల్లించడానికి గడువు ఇచ్చిందని.. దళితులు గడువు అడిగితే ఇవ్వకుండా కర్కశంగా రద్దు చేస్తూ నోటీసులు జారీచేయడంపై ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీల ప్లాట్లు తిరిగి ఇవ్వాలి 
బడాబాబులకు పావలాకి రూపాయికి వేల ఎకరాలు ఇస్తున్న ఏసీఐఐసీ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చిన్నచిన్న ఎంఎస్‌ఎంఈ ప్లాట్లు రద్దుచేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చిన్నచిన్న కారణాలతో గత నెలలో ఏపీఐఐసీ దాదాపు 1,200 ప్లాట్లు రద్దు చేసింది. వాటిని వెంటనే తిరిగి ఇవ్వాలి. పరిశ్రమలు పెట్టుకోవడానికి మరో మూడేళ్లు గడువు ఇవ్వాలి. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహకాల చెల్లింపులోనూ ఇంతే పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తల పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. 

వారంతా రాయితీల కోసం నెలల తరబడి ధర్నా చేస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని.. అదే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు చెందిన కంపెనీలకు ఏకంగా రూ.36.68 కోట్లు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా గ్రూపులకు రూ.15.60 కోట్లు, ఎంపీ బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌కు రూ.3.47 కోట్లు, అవంతి ఫీడ్స్‌కు రూ.2.53 కోట్లు, వల్లభనేని సుధాకర్‌చౌదరికి చెందిన మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు రూ.60.50 కోట్ల ప్రోత్సాహకాలు ఎలా చెల్లించారని దళిత పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు. ఒకపక్క సబ్సిడీలు అందక, బ్యాంక్‌ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న దళిత పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించడానికి గడువు పెంచాలని లేకపోతే కనీసం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్లాట్ల రద్దు చర్యలను తక్షణమే ఆపాలి 
ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక ప్లాట్లు పొందిన సుమారు 1,600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను ప్రభుత్వం వేధించడం తగదు. కార్పొరేట్లకు ఎకరా రూపాయికే భూములిచ్చే ప్రభుత్వం, పేద ఎస్సీ, ఎస్టీలకు మాత్రం నోటీసులివ్వడం అన్యాయం. సెప్టెంబర్‌ 11న జీవో ఇచ్చి అక్టోబర్‌ 10 లోపు పూర్తి సొమ్ము చెల్లించమనడం లబ్ధిదారులపై భారం మోపడమే. సబ్సిడీలు అందక, బ్యాంక్‌ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం గడువు పొడిగించాలి. ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలి. – పినమాల నాగకుమార్, అధ్యక్షుడు, ఏపీ దళిత ఎంట్రప్రెన్యూర్స్‌ ఎంపవర్మెంట్‌ అసోసియషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement