‘ఏపీ మోడల్‌’లో ఇంటర్‌ దరఖాస్తులకు ముగిసిన గడువు | Sakshi
Sakshi News home page

‘ఏపీ మోడల్‌’లో ఇంటర్‌ దరఖాస్తులకు ముగిసిన గడువు

Published Sat, May 25 2024 4:30 PM

‘ఏపీ మోడల్‌’లో ఇంటర్‌ దరఖాస్తులకు  ముగిసిన గడువు

రాయదుర్గంలో అత్యధికంగా 272 దరఖాస్తులు

రాయదుర్గంటౌన్‌: జిల్లాలోని ఏపీ ఆదర్శ పాఠశాల( ఏపీ మోడల్‌ స్కూల్‌)ల్లో మొదటి సంవత్సరం ఇంటర్‌ ప్రవేశాలకు విశేష స్పందన లభించింది. ఇంటర్మీయట్‌లో వివిధ కోర్సుల ప్రవేశాలకు గురువారంతో గడువు ముగిసింది. జిల్లాలో మొత్తం 15 మోడల్‌ స్కూళ్లు ఉండగా ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 1,890 దరఖాస్తులు అందాయి. జిల్లాలో అత్యధికంగా రాయదుర్గం ఏపీ మోడల్‌ స్కూల్‌కు 272 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తర్వాతి స్థానాల్లో గుత్తిలో 269, గార్లదిన్నెలో 210, పామిడిలో 208, కళ్యాణదుర్గంలో 196, తాడిపత్రిలో 163, రాప్తాడులో 149, పుట్లూరులో 148, ఉరవకొండలో 131, విడపనకల్లులో 89, కణేకల్లులో 78, శెట్టూరులో 70, వజ్రకరూరులో 62, యల్లనూరులో 59, యాడికి మోడల్‌ స్కూల్‌కు 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగియడంతో టెన్త్‌ ఫలితాల్లో మెరిట్‌ ప్రాతిపదికన అడ్మిషన్లు ప్రారంభించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు రాయదుర్గం మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేశులు తెలిపారు. మోడల్‌ స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఆంగ్థ మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.

పుస్తకాలందలేదనే ఫిర్యాదు రాకూడదు

గుంతకల్లు: ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలు అందలేదనే ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. పట్టణంలోని డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను భద్రపరిచారు. శుక్రవారం డీఈఓ తనిఖీ చేశారు. పట్టణంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఇండెంట్‌ ప్రకారం పాఠ్యపుస్తకాలు అందాయా? ఇంకా ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా? అని ఎంఈఓలు మస్తాన్‌రావు, సుబ్బరాయుడులను అడిగి తెలుసుకున్నారు. 1–7 విద్యార్థుల పుస్తకాలు తక్కువ వస్తే జిల్లా మేనేజర్‌కు, 8–10 పుస్తకాలు తక్కువస్తే విజయవాడకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికీ సకాలంలో పుస్తకాలు అందజేయాలన్నారు.

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరగాలి

కూడేరు: ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మంది పిల్లలు చేరేలా చూడాలని డీఈఓ వరలక్ష్మి మండల విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కూడేరు ఎమ్మార్సీని సందర్శించారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నోట్‌, పాఠ్యపుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకుని విద్యా సామగ్రిని భద్రంగా నిల్వ ఉంచి, బడులు తెరిచాక విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని మండల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో అందించే నాణ్యమైన విద్య గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 చంద్రశేఖర్‌, ఎంఈఓ–2 సాయికృష్ణ, సీఆర్పీలు రమణ, శివ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

నాలుగో రోజు కొనసాగిన సిట్‌ విచారణ

తాడిపత్రి అర్బన్‌: ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రిలో చోటు చేసుకున్న అల్లర్లపై సమగ్ర విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందజేసిన సిట్‌ అధికారులు... మరింత లోతైన విచారణలో భాగంగా రెండో విడత తాడిపత్రికి విచ్చేశారు. ఇప్పటికే మూడు రోజులుగా విచారణ కొనసాగింది. నాలుగో రోజు శుక్రవారం కూడా విచారణను అధికారులు చేపట్టారు. మూడు రోజులుగా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మకాం వేసిన సిట్‌ బృందం అల్లర్లకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను శుక్రవారం పరిశీలించింది. ఇప్పటి వరకూ నిందితుల్లో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు అనే అంశాలపై పరిశీలిస్తోంది. అంతేకాక అల్లర్లకు ముందు టీడీపీ వర్గీయులు భారీ సంఖ్యలో జేసీ నివాసం వద్దకు ఎలా చేరుకున్నారు అనే విషయంపై సిట్‌ బృందం లోతుగా విచారణ చేపట్టింది. పక్కా పథకం ప్రకారమే ముందుగానే ఆందోళనకారులు పట్టణంలోకి చొరబడ్డారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement