హత్యకేసులో నిందితులకు రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితులకు రిమాండ్‌

Published Fri, Dec 1 2023 1:04 AM

-

యల్లనూరు: మండలంలోని మేడికుర్తి సమీపంలో పొలం గట్టు వ్యవహారంలో రైతు నాగార్జున హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిట్టూరుకు చెందిన రైతు వెంకటరెడ్డి, శంకుతల, పెద్దిరెడ్డిని గిర్రమ్మబావి సాయిబాబా దేవాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఆదేశాల మేరకు గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

క్లీనర్‌కు తీవ్ర గాయాలు

గుత్తి రూరల్‌: జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని బళ్లారికి చెందిన ప్రసాద్‌, మల్లికార్జున లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి బొగ్గు లోడుతో బళ్లారికి బయలుదేరిన వారు... గురువారం వేకువజామున గుత్తి మండలం కొజ్జేపల్లి – రజాపురం గ్రామాల మధ్య 67వ జాతీయ రహదారిపై చేరుకోగానే బొగ్గుకు కప్పిన టార్పాలిన్‌ జారిపోయింది. దీంతో లారీని రోడ్డు పక్కన ఆపి టార్పాలిన్‌ను సరిచేసుకుంటున్న సమయంలో గుంతకల్లు వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఇద్దరినీ ఢీకొంది. ఘటనలో డ్రైవర్‌ ప్రసాద్‌ (48) తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ లారీని ఆపకుండా వెళుతుండడంతో స్థానికులు వెంబడించి గుంతకల్లు మండలం గొల్లలదొడ్డి వద్ద అడ్డుకున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను 108 అంబులెన్స్‌ ద్వారా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement