Sakshi News home page

సెస్సు.. లెస్సు!

Published Mon, Nov 20 2023 12:40 AM

అనంతపురంలోని కేంద్ర గ్రంథాలయం  - Sakshi

అనంతపురం: సెస్సు చెల్లింపులో స్థానిక సంస్థల ఉదాసీనత గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి గ్రంథాలయ పన్నును పట్టణాలు, పంచాయతీలతో పాటు నగర పాలక సంస్థ అధికారులు వసూలు చేస్తున్నా.... వాస్తవానికి ఆ పన్ను గ్రంథాలయ సంస్థకు చేరవేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. మౌలిక వసతుల కల్పనకు మృగ్యమవుతోంది. గ్రంథాలయాలకు వస్తున్న వారంతా నిరుద్యోగులు, విద్యార్థులే. వీరికి పోటీ పరీక్షల సామగ్రి, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి, వారి ఉన్నతికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత గ్రంథాలయ సంస్థపై ఉంది. అయితే స్థానిక సంస్థలు వసూలు చేసుకున్న సెస్సు జమ కాకపోవడంతో దీనిపై స్పష్టమైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా జిల్లాలో గ్రంథాలయాలు నీరసించిపోతున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్‌ వద్ద గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ పూర్తిగా సెస్సులు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

బకాయిలు రూ. కోట్లలోనే..

అనంతపురం జిల్లా పరిధిలోని నగర కార్పొరేషన్‌, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి(మునిసిపాలిటీ), కళ్యాణదుర్గం నగర పంచాయతీ, పామిడి గ్రామంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి, మడకశిర నగర పంచాయతీల్లో సెస్సు బకాయిలు మొత్తం రూ.20.09 కోట్లకు చేరుకున్నాయి. జిల్లాలో గ్రంథాలయాల నిర్వహణకు ఆర్థిక మూలాధారం ఈ సెస్సు మాత్రమే కావడం గమనార్హం. ప్రజల నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్‌ అధికారులు వసూలు చేసే పన్నుల్లో కొంత గ్రంథాలయ సెస్సు కింద చెల్లించాల్సి ఉంటుంది. రూ.100కు రూ.8 చొప్పున గ్రంథాలయ సెస్సు వసూలు చేస్తున్నట్లుగా ప్రజలకు ఇచ్చిన రసీదుల్లోనూ ఆయా అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నారు. అయితే సెస్సు వసూలు చేసుకుంటున్న స్థానిక సంస్థలు మాత్రం దానిని గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు.

నోటీసులు ఇస్తూనే ఉన్నాం

గ్రంథాలయ సంస్థకు బకాయిపడ్డ సెస్సు చెల్లించాలంటూ స్థానిక సంస్థలకు నోటీసులు ఇస్తూనే ఉన్నాం. ఇదే అంశంపై పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలసి విన్నవించాం. స్థానిక సంస్థలు వసూలు చేసుకుంటున్న సెస్సు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రంథాలయాల స్థాయి కూడా పెంచేందుకు మార్గం సుగమమవుతుంది. సెస్సు చెల్లింపునకు స్థానిక సంస్థలు సహకరించాలి. – ఎల్‌ఎం ఉమాదేవి,

చైర్‌పర్సన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ

గ్రంథాలయ పన్నుల చెల్లింపుల్లో

ఉదాసీనత

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన రూ.20.09 కోట్ల బకాయిలు

Advertisement

తప్పక చదవండి

Advertisement