టీడీపీకి రె‘బెల్స్‌’ గుబులు | Sakshi
Sakshi News home page

టీడీపీకి రె‘బెల్స్‌’ గుబులు

Published Sat, Apr 20 2024 2:05 AM

నామినేషన్‌ దాఖలు చేస్తున్న టీడీపీ రెబల్‌ అభ్యర్థి సివేరి అబ్రహం - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్‌గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్‌ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్‌ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్‌ రాని టీడీపీ నేతలు రెబల్స్‌గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్‌ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు.

బండారు ఇన్‌.. పైలా అవుట్‌ !

మాడుగుల టికెట్‌ పైలా ప్రసాద్‌కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్‌ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్‌గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్‌కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్‌ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్‌ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్‌ విసిరారు.

అరకులో డబుల్‌ ధమాకా..

అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్‌ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్‌ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్‌ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్‌ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్‌ వేస్తానని ప్రకటించారు.

అక్కడా తిరుగుబావుటా...!

పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్‌ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్‌గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్‌ నాయుడుకు హ్యాండ్‌ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్‌గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు.

రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్‌కు తన సత్తా చూపిస్తానని సవాల్‌ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్‌ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్‌

మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్‌

పాడేరు నుంచి నామినేషన్‌ వేసిన

కిల్లో రమేష్‌ నాయుడు

టికెట్‌ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ

జోరందుకున్న ప్రచారం

మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్‌ వేస్తానని బండారు ప్రకటన

అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన

సివేరి అబ్రహం

అదే బాటలో దొన్నుదొర..

నామినేషన్‌ వేసేందుకు సిద్ధం

Advertisement
Advertisement