breaking news
vitamin d2
-
కండరాలు, గుండె పనితీరుకు ఆ విటమిన్ అత్యంత కీలకం..!
ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో విటమిన్–డీ2 కంటే విటమిన్–డీ3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్లోని ఐసీఎమ్ఆర్– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపం ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే ప్రక్రియలో విటమిన్–డీ3 కీలక పాత్ర పోషిస్తుందని మగ ఎలుకలపై జరిపిన ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక ‘మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.పరిశోధనలో ఏం తేలిందంటే.. కండరాల పుష్టి: విటమిన్–డీ2తో పోలిస్తే విటమిన్–డీ3 తీసుకున్న ఎలుకలలో కండరాల పరిమాణం, కండరాల పీచు పరిమాణం, పట్టుకునే బలం గణనీయంగా పెరిగాయి.గుండె ఆరోగ్యం: గుండె కండరాల సంకోచవ్యాకోచాలు, గుండెకు సంబంధించిన జీవక్రియలలో విటమిన్–డీ3 అద్భుతమైన ఫలితాలను చూపించింది.శక్తి జీవక్రియలు: కండరాలవృద్ధికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి సంబంధించిన రసాయన ప్రక్రియలను విటమిన్–డీ3 వేగవంతం చేసింది.పరిశోధన ఇలాగవిటమిన్–డీ సాధారణంగా డీ–2, డీ–3 గా రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల కోసం ప్రయోగశాలలో పెరుగుతున్న మగ ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఒక సమూహానికి విటమిన్–డీ2, మరొక సమూహానికి విటమిన్–డీ3, ఇంకొక సమూహానికి రెండింటి మిశ్రమాన్ని, చివరి సమూహానికి విటమిన్–డీ లేని ఆహారాన్ని ఇచ్చారు.గుండె నిర్మాణాన్ని రక్షించడంలో..శరీరంలో కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ రెండు విటమిన్లు సమానంగా పనిచేసినప్పటికీ, కండరాలు, గుండె నిర్మాణాన్ని రక్షించడంలో విటమిన్–డీ3 ఎంతో శక్తివంతమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషాఇస్మాయిల్ వివరించారు. భవిష్యత్తులో ప్రజలకు అందించే విటమిన్ అనుబంధ ఆహారాలు (సప్లిమెంట్లు), పౌష్టికాహార పెంపుదల (ఫోర్టిఫికేషన్) కార్యక్రమాలలో కీలక మార్పులకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు. మానవులపై దీని ప్రభావాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని తెలిపారు. (చదవండి: ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!) -
‘డి2’.. ‘డి3’ ఏది బెస్ట్
ఆరోగ్యం కోసం విటమిన్లు అవసరం. మొక్కల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’కన్నా జంతు ఉత్పత్తుల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండింటితో కలిగే ప్రయోజనం ఒకేతీరుగా ఉంటుందన్న ప్రస్తుత అంచనా సరికాదని బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సర్రే శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవ్వాలన్నా.. ఎముకలను గట్టిపరిచే కాల్షియం శరీరానికి ఒంట బట్టాలన్నా విటమిన్ డి తప్పనిసరి. అయితే శరీరం ఈ విటమిన్ను స్వయంగా తయారు చేసుకోలేదు. సూర్యరశ్మి ద్వారా చర్మంలోని కణాలు విటమిన్ ‘డి3’ని తయారు చేస్తే అదికాస్తా కాలేయం.. మూత్రపిండాల్లోకి చేరి విటమిన్‘డి’గా మారుతుంది. అయితే కొన్ని మాంస ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి3’, శాకాహార ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి2’ రూపంలో లభిస్తుంది ఇది. ఈ నేపథ్యంలో ‘డి2’ కన్నా ‘డి3’ వల్లే శరీరానికి మేలెక్కువని ఓ పరిశోధన ద్వారా సర్రే శాస్త్రవేత్తలు తేల్చారు. దక్షిణాసియాకు చెందిన దాదాపు 335 మందిపై పరిశోధనలు జరిపారు. ‘డి3’ అందించిన వారిలో విటమిన్ ‘డి’దాదాపు 75% ఎక్కువ కాగా.. ‘డి2’ తీసుకున్న వారిలో 34% మాత్రమే ఉందని గుర్తించారు.


