‘మహా’మ్మారిని ఆపలేమా!
ముంబై: ఎయిడ్స్ మహమ్మరి హడలెత్తిస్తోంది. దేశంలోనే జనాభాలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ వ్యాధిలోనూ అదే స్థాయిలో పోటీపడుతోంది. వరల్డ్ బ్యాంక్ గతేడాది జూలైలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం నాలుగు లక్షల ఇరవై వేలు ఉండటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. మహారాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఎంఎస్ఏసీఎస్) ద్వారా ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపడుతున్నా రోగుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీటీసీ సెంటర్లను నిర్వహిస్తున్నా వాటికి ఆశించినంత ఆదరణ లభించడం లేదు. ఈ సెంటర్ల గురించి ప్రచారం బాగా చేసినా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. దీన్ని గుర్తించినా రాష్ట్ర సర్కార్ ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వారిలో ఉండే ఆందోళనను తగ్గించేందుకు ప్రాధాన్యమిచ్చింది. ఎయిడ్స్ వస్తే జీవితం అయిపోయినట్టు కాదని, సరైన మందులు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల జీవనకాలాన్ని పెంచుకోవచ్చని జాగృతి కల్పించేందుకు భరోసాఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యాధి రోగుల కోసం ఆర్ట్ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కేంద్రాల్లో ఉచిత మందులను పంపిణీ చేస్తోంది.
ఆరోగ్యం కోసం ఏయే పదార్థాలు తీసుకుంటే బాగుంటుందనే సలహాలను కూడా ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిలర్లను కూడా నియమించింది. అయితే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న ఎంఎస్ఏసీఎస్.... శ్రమకు తగ్గ ఫలితాలు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు ఈ వ్యాధి రోగుల సంఖ్య పెరగడంపై కలవరపడుతోంది. 1986లో ముంబైలోనే తొలి ఎయిడ్స్ కేసు నమోదైనప్పటి నుంచి వ్యాధిని నియంత్రించేందుకు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు విద్యార్థులకు ఎయిడ్స్‌పై జాగృతి కల్పిస్తోంది. ఇందులో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ఎయిడ్స్ రోగులు
సాక్షి, ముంబై: గడచిన ఐదేళ్లలో ముంబైలో నాలుగున్నర వేల మంది ఎయిడ్స్ రోగులు మృతి చెందారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిడ్స్ నిర్మూలన పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ఇంతమంది మృత్యువాత పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల్లో 4,319 పెద్దలు, 265 పిల్లలున్నారు. కాగా ఎయిడ్స్‌వల్ల మృతుల సంఖ్య పెరిగినప్పటికీ పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచార కార్యక్రమాల వల్ల హెచ్ఐవీ రోగుల సంఖ్య ఈ ఐదేళ్లలో తగ్గుముఖం పట్టిందని ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పేర్కొంది. డిసెంబర్ ఒకటో తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఆ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. గర్భిణీల్లో హెచ్ఐవీ 49 శాతం తగ్గిందని తెలిపింది.
చర్యలు తీసుకుంటున్నాం
ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ఎంఎస్ఏసీఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ శెట్టి అన్నారు. అయినా రెండో స్థానంలో ఉండటం బాధ కలిగిస్తుందన్నారు. అయితే స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో మరిన్ని జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
నేడు వివిధ కార్యక్రమాలు
డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ డే పురస్కరించుకొని ఎంఎస్ఏసీఎస్ ఆదివారం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎయిడ్స్‌పై జాగృతి కల్పించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ర్యాలీని నిర్వహించనున్నాయి. వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే శనివారం వివిధ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వాషి పోలీసు స్టేషన్ నుంచి రాజీవ్ గాంధీ కళాశాల విద్యార్థులు కర్మవీర్భావ్ పాటిల్ కాలేజ్ వరకు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మరిన్ని ప్రాంతాల్లో వ్యాధిపై జాగృతి కల్పించారు.