breaking news
stage actress
-
గాసిప్ మా బలం
స్త్రీలు గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటారనే ఒక ప్రచారం ఉంటుంది. ఆడవాళ్ల కబుర్ల కింద వీటిని కొట్టేస్తూ ఉంటారు. కాని ‘గాసిప్’ స్త్రీల స్నేహానికి ఒక వారధి అని, స్త్రీలు ఒకరితో మరొకరు చెప్పుకునే ఈ కబుర్లే పురుషుడి పెత్తనం నుంచి బయట పడేసే ఓదార్పు అని అంటున్నారు అంజలీ కృష్ణదాస్. కేరళకు చెందిన ఈ రంగస్థల నటి మరో ఇద్దరు నటీమణులతో కలిసి ప్రచారం చేస్తున్న ‘గాసిప్’ నాటకం స్త్రీల స్నేహాలపై కొత్త దృష్టిని కలిగిస్తోంది.అర్థవంతమైన మాటలు, దేశాన్ని ఉద్దరించే మాటలు మగవాళ్లు మాట్లాడుకుంటారట... ఆడవాళ్లు ఉత్త పోచికోలు కబుర్లు చెప్పుకుంటారట. అలా అని ఎవరన్నారు? మగాళ్లే. ఆడవాళ్ల మాటలకు అర్థాలు ఉంటాయని, ఆడవాళ్ల మాటల్లో ఆలోచనలు ఉంటాయని వారికి తెలుసునా?‘తెలియ చేయాలి’ అంటారు అంజలి కృష్ణదాస్. ఈమె ‘కొచ్చి’కి చెందిన క్లాసికల్ డాన్సర్. మరో క్లాసికల్ డాన్సర్ పొన్ను సజీవ్తో కలిసి అక్కడ ‘తుడిప్పు డాన్స్ ఫౌండేషన్’ అనే సంస్థను నడుపుతున్నారు. తన సంస్థ ద్వారా అందరూ స్త్రీలే భాగస్వామ్యం వహించేలా ఒక నాటకం వేయాలని అనుకున్నప్పుడు ఆమె దృష్టికి వచ్చిన వస్తువు ‘గాసిప్’. దీనికి సరైన తెలుగు మాట లేదు. గుసగుసలు, కబుర్లు, చాడీలు, పుకార్లు... అన్నీ కలిపితే గాసిప్. ఆడవాళ్లు ‘గాసిప్’ ఎందుకు మాట్లాడతారు? వాళ్లు మాట్లాడేదంతా గాసిప్పేనా? ఆ సంగతి చర్చించడానికే 45 నిమిషాల ‘గాసిప్’ అనే డాన్స్ డ్రామా సృష్టించారు అంజలి కృష్ణదాస్, పొన్ను సజీవ్.గాసిప్‌కు మూలం ఏమిటి?‘గాసిప్’ ఇంగ్లిష్ మాటకు మూలం గాడ్సిబ్. పూర్వం నెలలు నిండిన స్త్రీలు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్లు వాళ్లు బయటకు రావడానికి వీలుండదు. మరి ఇంట్లో అలాగే మగ్గితే విసుగెత్తి పోతారు. అందుకే ఆ సమయంలో నమ్మకంగా ఇంటికొచ్చి ఇరుగూ పొరుగున ఏం జరుగుతుందో చెప్పే స్నేహితురాళ్లను గాడ్సిబ్ అనేవారు. నెమ్మదిగా ఆ మాట నుంచి గాసిప్ పుట్టింది. ‘గాసిప్‌ను కాలక్రమంలో చెడ్డ మాటను చేశారు. కాని అది స్త్రీల మధ్య స్నేహానికి సంబంధించిన పదం. ఆ పూర్వపు మర్యాద ఆ పదానికి తీసుకురావడమే మా ప్రయత్నం’ అన్నారు అంజలీ కృష్ణదాస్.బూట్లూ– హైహీల్సూ‘గాసిప్’ నాటకంలో చాలాచోట్ల మగవాళ్ల బూట్లు ప్రదర్శిస్తారు నటీమణులు. ‘హీరో బూట్ల మీదే షాట్ ఓపెన్ చేస్తారు ఎందుకు? బూట్లు అధికారానికి, పురుష స్వామ్యానికి, పీడనకి గుర్తు. ఈ సినిమాలో బూట్ల బరువును ఆడవాళ్లు తోటి ఆడవాళ్ల సాయం, మాట సాయం వల్లే మోస్తారు. ఆఖరున వారు బూట్ల రాసి మధ్యన తమ హైహీల్స్ బయటకు తీయడంతో నాటకం ముగుస్తుంది’ అంటారు అంజలి.‘గాసిప్’ నాటకానికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే విచిత్రం ఏముంది. స్త్రీలు చేసే కొత్త ఆలోచనలకు ఎప్పుడూ ప్రశంసలే కదా. అపాయంలో ఉపాయంస్త్రీలు గాసిప్ మాట్లాడని చోటు ఉండదు. వంటిగది, బ్యూటీ సెలూన్, రేషన్ షాప్, వీధి మలుపు, ఇంటి పిట్టగోడ... ఈ పిట్టగోడ మీద అనేక కార్టూన్లు కూడా ఉన్నాయి. ‘కాని స్త్రీల కబుర్లన్నీ వారు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే వొత్తిడిని, పురుషుల పెత్తనాన్ని దూరం చేసేవే. వారు సాటి స్త్రీలతో మాట్లాడి సలహాలు తీసుకుంటారు, సూచనలు అందుకుంటారు, అపాయాల్లో ఉంటే ఉపాయాలు తెలుసుకుంటారు... పురుషుణ్ణి ఎదుర్కొనడమే వీటన్నింటి లక్ష్యం. తరతరాలుగా గాసిప్ మాట్లాడుతూ స్త్రీలు తమ నిత్య జీవితంలోని ఘర్షణలను దాటుతున్నారు’ అంటారు ‘గాసిప్’ రూపకర్తలు. -
రంగస్థల నటి వాణీబాల మృతి
కంబాలచెరువు (రాజమండ్రి) : నంది నాటకోత్సవాల్లో మంచి ప్రతిభ కనబరిచిన రంగస్థల నటి టి.వాణిబాల ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త కళాకారులను తీవ్రంగా కలిచివేసింది. వాణిబాల ఈనెల 24న ది యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘దేశమును ప్రేమించుమన్నా’ పద్యనాటకంలో రుక్సానా పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఆమె పలి కించిన భావాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆమె ‘సాక్షి’తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ అయింది. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వాణిబాల నాటకం ముగిసిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి ఆమె మరణిం చారు. వడదెబ్బ వల్ల మృతిచెంది నట్టు వైద్యులు తెలిపారు. వాణిబాల తన ఏడోఏటే నటిగా రంగస్థల ప్రవేశం చేశారు. తల్లిదండ్రులు కళాకారులు కానప్పటికీ నటనపై మక్కువతో ఈ రంగంలో ఉంటున్నారు. సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చారు. 2004లో ‘నిశ్శబ్ద విప్లవం’ నాటికకు నంది బహుమతి గెలుచుకున్నారు. కళావాణి సంతాపం వాణిబాల మృతికి కళావాణి (ఉభయగోదావరులు రాజమండ్రి) సంస్థ సంతాపం ప్రకటించింది. తమ సంస్థలో వాణిబాల గోరంత దీపం నాటకంతో రంగప్రవేశం చేశారని, ఆమె నటించిన భయం, ఏ వెలుగుకీ ప్రస్థానం, గుప్పెటతెరు, మిథునం వంటి నాటకాలు మంచిపేరు తీసుకువచ్చాయని ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ స్టాలిన్, అధ్యక్షుడు తుమ్మిడి రామ్‌కుమార్ తెలిపారు.


