breaking news
Samalkot railway station
-
యువకుడిని ట్రాక్‌పై కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఆర్పీఎఫ్ సిబ్బంది
కాకినాడ: రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) పోలీసులు ఓ యువకుడిని రైల్వే ట్రాక్‌పై కొట్టుకుంటూ నడిపించుకుని తీసుకెళ్లిన ఘటన విమర్శలకు దారి తీసింది. వివరాలివీ.. ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలపై ఆ యువకుడిని సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది శుక్రవారం పట్టుకున్నారు. అతడిని స్టేషన్లో రైల్వే ట్రాక్‌పై కొట్టుకుంటూ నడిపించుకుని తీసుకెళ్లి, ప్రభుత్వ రైల్వే పోలీసుల(జీఆర్పీ)కి అప్పగించారు. ప్లాట్‌ఫారంపై అందరూ చూస్తూండగానే ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడం చర్చనీయాంశంగా మారింది. తమ కళ్ల ముందే ఆ యువకుడిని ఆవిధంగా తరలించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏ తప్పు చేసినప్పటికీ ఆ యువకుడిని ఇలా ట్రాక్‌పై నడిపిస్తూ, కొట్టడం సరికాదని ప్రయాణికులు అంటున్నారు. సామాన్య ప్రయాణికులు ట్రాక్‌పై నడిస్తే రూ.500 జరిమానా వేసిన ఆర్పీఎఫ్, ఇప్పుడు తామే ట్రాక్‌పై ఓ వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడాన్ని పలువురు తప్పు పట్టారు. ఇది ప్రయాణికుల భద్రత నిబంధనలకు విరుద్ధమని, ఆ సమయంలో రైలు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్న యువకుడిని అదుపులో తీసుకున్నామని, దీనిపై విచారణ కొనసాగుతుందని రైల్వే పోలీసులు చెప్పారు.ఇదీ చదవండి: వియత్నాం పర్యటనకు ఇంగ్లిష్ టీచర్ శిరీష -
నరకం చూశారు...
- సామర్లకోట రైల్వేస్టేషన్లో మొరాయించిన లిఫ్టు - 15 నిమిషాల పాటు ప్రయాణికుల అవస్థలు సామర్లకోట : అది సామర్లకోట రైల్వే స్టేషన్.. విశాఖ- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ అప్పుడే మూడోప్లాట్‌ఫాంపైకి వచ్చింది. ఆ రైలు నుంచి దిగిన ప్రయాణికులు మొదటి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అక్కడ ఉన్న లిఫ్టు ఎక్కారు. అయితే అది కాస్తా మధ్యలో నిలిచిపోయింది. దీంతో వారు నరకయాతన అనుభవించారు. సాయంత్రం 5.35కు లిఫ్టులోకి చేరిన వారు 5.50కి తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్టు నిలిచిపోవడంతో ప్రాణాలు పోయినంత పని అయ్యిందని ఎన్ అప్పారావు, సత్యవతి, హర్షితలు ‘సాక్షి’కి చెప్పారు. గతంలో రెండు సార్లు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న లిఫ్టు ఇలానే మొరాయించడంతో ఉన్నతాధి కారులు సుమారు నెల రోజుల పాటు లిఫ్టును నిలిపి మరమ్మతులు చేయించారు.


