అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
15-20 ఏళ్ల క్రితం కామెడీ సినిమాలు అనగానే అల్లరి నరేశ్ గుర్తొచ్చేవాడు. తర్వాత కాలంలో చాలానే మూవీస్ చేశాడు గానీ ఎందుకనో సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం 'నాంది' లాంటి డిఫరెంట్ చిత్రం చేసి హిట్ అందుకున్నాడు. తర్వాత రకరకాల సీరియస్ సినిమాలు ట్రై చేశాడు. అవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తిరిగి తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'రంభ ఊర్వశి మేనక'. ఈరోజు(సెప్టెంబరు 04) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం నాటకాలు వేస్తూ బతుకుతుంటుంది. వీళ్ల ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్. దానిపై సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారని చిన్నతంలో సూరికి తెలుస్తుంది. దీంతో ఏ పనిచేయకుండా ఊరంతా అప్పులు చేసి సదరు పుస్తకంపై 15 ఏళ్లుగా గీతలు గీస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరికి తన తల్లి ప్రాణాంతక వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. అదే టైంలో ప్రేమించిన చిన్ని(సురభి) తండ్రితో ఓ చిక్కొచ్చి పడుతుంది. మరోవైపు ఓ రాత్రి చేసిన పనివల్ల నిజంగానే రంభ-ఊర్వశి-మేనకలు సూరి కోసం దిగివస్తారు. వీళ్ల రాకతో సూరి జీవితం ఎలా మారింది? ఎస్సై అప్పలనాయుడితో సూరికి గొడవేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు అల్లరి నరేశ్ సినిమాలు గానీ మీరు చూసుంటే అతడు చేసే సిల్లీ కామెడీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా కథ, కథనాలతో అదే హీరో చేసిన మూవీ ఇది. గతంలో ఇతడు తీసిన చిత్రాల చూస్తున్నట్లే ఉంటుంది. అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఓవరాల్‌గా ఓకే ఓకే అనిపిస్తుంది తప్పితే మరీ పగలబడి నవ్వేంత గొప్పగా లేదు.నాటకాలు వేసే ఓ కుటుంబంలో హీరో పుట్టడం, మ్యాజిక్ బుక్ అతడి దొరకడం, రంభ, ఉర్వశి, మేనక కోసం హీరో పట్టువదలకుండా ప్రయత్నించడం.. ఇదంతా అలా సాగుతూ ఉంటుంది. మరోవైపు తన ఊరిలో ఉండే చిన్నితో హీరో ప్రేమ, వీళ్ల ప్రేమకథకు ఓ విలన్.. ఇలా హడావుడి లేకుండా ఫస్టాప్ అంతా ఉంటుంది. ఇదేమంత కొత్తగా ఉండదు. ఎన్నో తెలుగు సినిమాల్లో ఇలాంటివన్నీ చూసేశాం కదా.. అసలు పాయింట్లోకి ఎప్పుడొస్తారా అనిపిస్తుంది.ఎప్పుడైతే సూరి దగ్గరకు రంభ-ఊర్వశి-మేనకలు దిగివస్తారో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఓవైపు తల్లి చావు బతుకుల్లో ఉంటే అప్సరసలతో కలిసి హీరో కామెడీ చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. సరేలే కామెడీ కదా ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటే మధ్యమధ్యలో తల్లి సెంటిమెంట్ వస్తూ ఉంటుంది. కామెడీని చూసి అక్కడక్కడ నవ్వుతాం గానీ తల్లి ఎమోషన్‌కి కనెక్ట్ కాలేకపోతాం. ఎందుకో తల్లి ట్రాక్ సహజంగా కుదరలేదు.ఈ సినిమా చూస్తున్నంతసేపు పెద్దగా లాజిక్స్ వెతక్కూడదు. పొరపాటున హీరో అలా ఎందుకు చేశాడు? ఇది ఎందుకు ఇలా జరిగింది? అనే సందేహం బుర్రలో వచ్చిందా? మూవీ కనెక్ట్ కావడం కష్టమైపోవచ్చు. కాబట్టి సరదాగా నవ్వుకోవడానికి చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారు?సూరి పాత్రలో అల్లరి నరేశ్ బాగానే చేశాడు. ఈ తరహా పాత్రలు ఇతడికి కొట్టినపిండి. సీనియర్ నరేశ్ కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. వయసైపోయిన వ్యక్తి పాత్రలో ఇతడు.. రంభతో నడిపే లవ్ ట్రాక్ మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. హీరోయిన్ సురభికి పెద్దగా స్కోప్ లేదు. రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అందంగా ఉన్నారు. కాకపోతే షో కేస్ బొమ్మలా చూపించారు తప్పితే వీళ్లకు సరైన సీన్స్ పడలేదనిపించింది. వెన్నెల కిశోర్, హరితేజ కామెడీ ఓకే ఓకే. ఎస్సై అప్పలనాయుడిగా కన్నడ నటుడు తారక్ పొన్నప్పకు మంచి స్కోప్ దొరికింది. ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అద్భుతాలు జరిగిపోయి తమ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుందనుకునే చాలామంది సోమరిపోతు కుర్రాళ్లకు చివర్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. దర్శకుడు చంద్రమోహన్ తన రైటింగ్‌తో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కొంతమేర సక్సెస్ అయ్యాడు.- చందు డొంకాన