‘చింతలపూడి’ కాలువ పనులకు ఆటంకం
చింతలపూడి: మండలంలోని ప్రగడవరం గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ తవ్వకం పనులను బుధవారం కూడా రైతులు అడ్డుకున్నారు. పథకంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచే వరకు పనులను జరగనివ్వమని భీష్మించారు. కాలువ భూసేకరణ నిమిత్తం సర్వే సిబ్బంది వచ్చిన విషయం తెలుసుకున్న ప్రగడవర ం, వెలగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని టెంట్ వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం పరిహారం విషయం తేల్చే వరకూ సర్వే పనులు నిలిపివేయాలని గోలి రామకృష్ణారెడ్డి, ఎస్.రమేష్‌రెడ్డి, గంగవల్లి చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూసేకరణ తరహాలో తమకూ ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించాలని మండలంలోని రైతులు మే నెల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కొందరు రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.