breaking news
Islam Mecca
-
31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్.. ఉపవాసం దీక్ష ఎప్పుడంటే?
ముస్లింలందరూ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో, అదే రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభం కానుండటం విశేషం. చివరగా 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ మాసం మొదలైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో రంజాన్ మాసం ప్రారంభమవనుంది. ఇక, ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిలందరూ ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ రంజాన్ మాసం నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో, రంజాన్ మార్చి 20 లేదా 21 తేదీన వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం, ఉపవాసాన్ని విరమించడానికి, ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు.ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, రంజాన్ నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. తొలి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎందుకని పవిత్ర మాసంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ఎందుకు పాటిస్తారు.అయితే, రంజాన్ అనేది ఓ నెల పేరు. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్లో తొమ్మిదో నెల. ముస్లింలు ఆచరించేది చంద్రమాన క్యాలెండర్. ముస్లిం క్యాలెండర్ అనేది ఎలా ఏర్పడిందంటే.. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వెళ్లడం జరిగింది. దీన్నే హిజ్రత్ అని కూడా అంటారు. క్రీస్తు శకం లేదా సామాన్య శకం 622లో ఇది జరిగినట్లు చెబుతారు. దీన్నే హిజ్రీ శకం అని అంటారు.మొదటి నెల మొహరంక్రీస్తు శకం లేదా సామాన్య శకం 638లో ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహరం, రెండో నెల సఫర్, మూడో నెల రబీ ఉల్ - అవ్వల్, నాలుగో నెల రబీ ఉల్ -ఆఖిర్, ఐదో నెల జమాది ఉల్ - అవ్వల్, ఆరో నెల జమాది ఉస్- సాని, ఏడో నెల రజబ్, ఎనిమిదో నెల షాబాన్, తొమ్మిదో నెల రంజాన్, పదో నెల షవ్వాల్, పదకొండో నెల జుల్ - ఖాదా, పన్నెండో నెల జుల్ - హిజ్జా. అయితే తొమ్మిదో నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు. అందుకే ఈ రంజాన్ నెలను పవిత్ర మాసంగా, పవిత్ర పండుగగా ప్రతీ ముస్లింలు ఆచరిస్తారు. ఈ పండుగనే ఈద్-ఉల్-ఫిత్ర అని కూడా పిలుస్తారు. -
ఇస్లాం మక్కాలో ముహమ్మద్ జననం
అది క్రీస్తు శకం 571. ఒకనాటి రాత్రి అరేబియా దేశంలోని మక్కానగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నక్షత్రాలు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయి. ఒకవైపు కాబాగృహం. మరోవైపు అబ్దుల్ ముతల్లిబ్ ఇల్లు. రెండుచోట్లా ఒకే రకమైన కాంతిపుంజాల కనకవర్షం ప్రారంభమైంది. కాబానుండి ముతల్లిబ్ గృహం వరకు వజ్రాలు వెదజల్లినట్లుగా మార్గమంతా మెరిసిపోతోంది. సరిగ్గా తెల్లవారుజామున ఈ వెలుగులన్నిటినీ పూర్వపక్షం చేస్తూ, ఆకాశంలో ఓ అద్భుత నక్షత్రం ఉదయించింది. అరేబియా చరిత్రలో అంతకుముందు ఏనాడూ ఇలాంటి అద్భుతం జరగలేదు. ప్రజలు మరింత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇందులో ఏ విధమైన మర్మం ఉందోనని ఒకవైపున భయపడుతూనే, మరోవైపు ఏదో మహత్తర శుభసందేశమే ఉండి ఉంటుందని అనుకున్నారు. తెల్లవారుతుండగా అబ్దుల్ ముతల్లిబ్ ఇంట కోలాహలం పెరిగిపోయింది. అమ్మలక్కలతో ఆ గృహం వేడుకలా మారిపోయింది. అంతలో ఒక స్త్రీ విప్పారిన మోముతో పరుగు పరుగున వచ్చి అబ్దుల్ ముతల్లిబ్కు మనుమడు కలిగాడని శుభ వార్త అందజేసింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అబ్దుల్ ముతల్లిబ్ మదిలో అంతకు కొద్ది రోజుల ముందు చనిపోయిన కొడుకు అబ్దుల్లా జ్ఞాపకాలు సుడులు తిరిగాయి. కాని మనుమడిని చూస్తూనే ఆయన కళ్లలో కోటికాంతులు విరబూశాయి. మక్కా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అబ్దుల్ ముతల్లిబ్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అటు ఆమినా పరిస్థితి కూడా అలాగే ఉంది. భర్త జ్ఞాపకాలు ఆమె కళ్లను నిండుకుండలు చేశాయి. సజల నయనాలతోనే ఆమె తోటి మహిళల అభినందనలు స్వీకరిస్తోంది. మక్కాప్రజలంతా అబ్దుల్లా, ఆమినా దంపతులకు కొడుకు పుట్టాడని, సృష్టిలోని అందాన్నంతా కలబోసి చేసిన బంగారు బొమ్మలా, అందమైన మోముతో మెరిసిపోతున్న బాబును గురించి మక్కా పరిసరాల్లో ఒకటే చర్చప్రారంభమైంది. అబ్దుల్ ముతల్లిబ్ ఆ బాలుడికి ముహమ్మద్ అని నామకరణం చేశారు. ఈ శుభవార్తను ఆనాటి ఓ గొప్ప క్రైస్తవ పండితుడైన అయిస్కు తెలియజేయాలని అబ్దుల్ ముతల్లిబ్ ఆయన వద్దకు వెళ్లారు. క్రైస్తవ పండితుడు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ‘అబ్దుల్ ముతల్లిబ్, నీకు శుభం. పిల్లవాడి పేరేం పెట్టావు?’ అని ఆరా తీశాడు. ‘ముహమ్మద్’ అని నామకరణం చేశాను’ అన్నారు ముతల్లిబ్ విప్పారిన ముఖంతో. ‘ముహమ్మద్’ అంటూ రెండుసార్లు ఉచ్చరిస్తూ, దీర్ఘాలోచనతో ‘ముతల్లిబ్, నేను ఇంతకాలం చెబుతూ వచ్చిన బాలుడు ఇతనే’ అన్నాడు క్రైస్తవ పండితుడు నమ్మకంగా. ‘అవునా?’ అన్నారు అబ్దుల్ ఆశ్చర్యంగా. ‘అవును, నేనింత నమ్మకంగా చెప్పడానికి మూడు కారణాలున్నాయి’ ‘మూడుకారణాలా?’ ఏమిటవి?’ ‘ఒకటి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాత్రి ఓ అద్భుతమైన నక్షత్రవెలుగు మక్కాపరిసరాలను జాజ్వల్యమానం చేసింది. రెండు: బాబు జన్మించింది సోమవారం రోజు. మూడు: అతని పేరు మహమ్మద్. ఈ మూడు కారణాల వల్ల ఆ బాలుడు సామాన్యమైన బాలుడు కాదని చెప్పగలను’ అన్నాడు పండితుడు. (డిసెంబర్ 24న ముహమ్మద్ ప్రవక్త జయంతి) వచ్చేవారం ప్రవక్త జీవితంలోని మరికొన్ని ఘట్టాలు... - ఎం.డి. ఉస్మాన్ ఖాన్


