breaking news
global propaganda
-
Global Investors Summit 2023: భారత సౌభాగ్యంతోనే ప్రపంచ సౌభాగ్యం
లక్నో: ప్రపంచ సౌభాగ్యం భారతదేశ అభివృద్ధితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తే ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుకు హామీ అని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమైంది. విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆర్థిక ప్రగతి ఇండియాతో అనుసంధానమై ఉందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వివరించారు. ఇక్కడున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఇండియా ప్రగతికి ఉత్తరప్రదేశ్ కీలకమైన నాయకత్వాన్ని అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి సంక్షోభాల నుంచి భారత్ వేగంగా బయటపడిందని, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో యువత ఆలోచనా ధోరణిలో, సమాజం ఆకాంక్షల్లో భారీ మార్పు కనిపిస్తోందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా మరింత అభివృద్ధిని చూడాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటున్నాడని వెల్లడించారు. ఆరేళ్లలో యూపీకి సొంత గుర్తింపు భారత్లో సంస్కరణల పర్వం కొనసాగుతుందని మోదీ తెలియజేశారు. ఆధునిక భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గతంలో ‘బీమారు’ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేదని, ఇప్పుడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని వ్యాఖ్యానించారు. ఆరేళ్ల వ్యవధిలో సొంత గుర్తింపును సాధించిందని చెప్పారు. సుపరిపాలన, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరత్వం వంటి వాటితో సంపద సృష్టికర్తలకు అవకాశాల గనిగా మారిందన్నారు. సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఎన్.చంద్రశేఖరన్ తదితరులు మాట్లాడారు. వివిధ కంపెనీలతో 18,000 ఎంఓయూ కుదుర్చుకుంటామని యోగి వివరించారు. మధ్యతరగతి బడ్జెట్ ముంబై: కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్తో మధ్యతరగతిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీఏ పాలనలో ప్రజల ఆదాయంపై 20 శాతం దాకా పన్ను ఉండేదని, ఈ బడ్జెట్లో సున్నా శాతం పన్ను విధించినట్లు గుర్తుచేశారు. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి షోలాపూర్, షిర్డీకి వందేభారత్ రైళ్లను మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వేతన జీవులను, మధ్యతరగతి ప్రజలను బడ్జెట్ సంతోషపెట్టిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తమ నియోజకవర్గాల్లోని స్టేషన్లలో రైళ్లను ఒక ట్రెండు నిమిషాలపాటు ఆపాలని గతంలో లేఖలు రాసిన ఎంపీలు ఇప్పుడు వందేభారత్ రైళ్ల కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి నారాయన్ రాణే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. -
'విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దు'
-
'విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దు'
హైదరాబాద్: తమ పార్టీపై ఓ రెండు పత్రికలు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. వాస్తవాలు రాయలేకపోయినా కనీసం వాస్తవానికి దగ్గరవుండే వార్తలు రాయాలన్నారు. విషప్రచారం ద్వారా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ బలోపేతంగా ఉందని, ఎవరూ పార్టీ వదిలి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబులా అద్భుతమైన అబద్దాలు ఆడిన నేత ప్రపంచంలో ఎక్కడా ఉండరని అంబటి రాంబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఐదు సంతకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దపు వాగ్దానాలు నమ్మి జనం ఓట్లు వేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసి పొరపాటు చేశామని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదన్నారు.