ఈ-లెర్నింగ్.. ‘సక్సెస్’
శామీర్‌పేట్, న్యూస్‌లైన్ :
ఓ అరుదైన ప్రయోగానికి ఆ ప్రభుత్వ పాఠశాల వేదికైంది. ఆధునిక పద్ధతుల్లో ఆ పాఠశాల విద్యార్థులకు బోధన సాగుతోంది. జిల్లాలోనే తొలిసారిగా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఈ-లెర్నింగ్ విధానంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో సైన్స్‌తో పాటు మిగతా సబ్జెక్టుల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు కంప్యూటర్, ప్రొజెక్టర్ సాయంతో అవగాహన చేసుకున్న పాఠాలను తోటి విద్యార్థులకు బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ వినూత్నమైన ఈ - లెర్నింగ్ ప్రక్రియ ఎలాంటి ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలంటే మండలంలోని లాల్గడిమలక్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లితీరాలి.
‘సక్సెస్’ పాఠశాలల్లో ప్రత్యేకం...
విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి కొన్ని ప్రభుత్వ పాఠశాలలను ‘సక్సెస్’ పేరిట ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మండల పరిధిలో 17 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిలో ‘సక్సెస్’ కింద ఎంపిక చేసిన 10 పాఠశాలల్లో లాల్గడిమలక్పేట్ జెడ్పీహెచ్ఎస్ ఒకటి. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 251మంది బాలురు, 274మంది బాలికలు చదువుకుంటున్నారు. రెండేళ్లుగా 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధిస్తుండటంతో వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల మండల, జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లలోనూ ప్రతిభ చాటుకున్నారు. అలాగే చదువులో, క్రీడల్లోనూ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు.
అమెరికన్ సంస్థ తోడ్పాటు...
అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ (ఏఐఎఫ్) నిర్వహించే విద్యా విషయక కార్యక్రమాల్లో లాల్గడిమలక్పేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొని సత్తా చాటుకున్నారు. దీంతో స్పందిం చిన ఆ సంస్థ విద్యార్థులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింతగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చింది. రెండు సంవత్సరాల క్రితం పాఠశాలకు ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్ సమకూర్చి ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని కల్పించింది.
అన్ని సబ్జెక్టుల పాఠాలు కంప్యూటర్‌తోనే...
పాఠశాలలో ఉపాధ్యాయులు రోజూ పిరియడ్‌లో కంప్యూటర్ ద్వారా ఆయా సబ్జెక్టులను బోధిస్తున్నారు. వీటిలో 6,7వ తరగతి విద్యార్థులకు కార్టూన్లు, బొమ్మలతో వైవిధ్యమైన విద్యను, అలాగే 8, 9 తరగతులతో పాటు అప్పుడప్పుడు 10వ తరగతి విద్యార్థులకు సైన్స్‌తోపాటు మిగతా సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతమంది దాతల సహాయంతో పాఠశాలలోని ఓ గదిలో ల్యాప్‌టాప్, ప్రొజె క్టర్, పెద్ద తెరను ఏర్పాటు చేయించారు. అన్ని తరగతుల సైన్స్ పాఠాలకు ఆయా అంశాలకు తగిన దృశ్యాలను అనుసంధానించి, ఎక్కడెక్కడ వ్యాఖ్యానం ఉండాలో, ఎలా చెబితే పిల్లలకు అర్ధమవుతుందో ఊహిస్తూ సీడీల్లో రికార్డు చేశారు.
గ్రహాల గమనం, ప్రయోగాలు చేసే విధానం, పరికరాల పనితీరు, రసాయనిక చర్యలు, జంతువుల వివరాలు, అవి నివాసం ఉండే ప్రాంతాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు తదితర అంశాలు విద్యార్థులను ఆకట్టుకునేలా దృశ్యరూపకంలో మలిచారు. మిగతా సబ్జెక్టులకు సంబంధించి కార్టూన్లు, బొమ్మలతో పిల్లలకు అర్థమయ్యేలా బోధనగావిస్తూ విజ్ఞానం పెంపొందిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులకు ఆయా పాఠాలను కంప్యూటర్ ద్వారా ఎలా చెప్పవచ్చో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఆయా అంశాలను మిగతా విద్యార్థులకు తెలియజేయడంతో పాటు వివిధ అంశాలపై జరిగే పోటీల్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో పాఠశాలలోని విద్యార్థులు చదువుకోవడంతో పాటు బోధకులుగా కూడా రాణిస్తున్నారు.
ఉత్సాహం నింపింది...
పాఠశాలలో ఈ-లెర్నింగ్ విధానం నాలో ఉత్సాహం నింపింది. చదవాలన్న కాంక్ష పెరిగింది. తెలుగు మీడియంకు బదులు ఇంగ్లిష్ మీడియం తీసుకున్నాను. ఈ- లెర్నింగ్‌లో చెప్పే పాఠాలు చాలా తొందరగా అర్థం అవుతున్నాయి.
- పి.నవీన్, ఏడో తరగతి
సబ్జెక్టులపై ఆసక్తి పెరిగింది...
పుస్తకాల్లో చదువుకున్నవి ఈ-లెర్నింగ్ విధానంలో ప్రత్యక్షంగా చూస్తుండటంతో చక్కగా అర్ధమవుతున్నాయి. ఇదివరలో సామాన్యశాస్త్రం అంటే భయం వేసేది. ఇప్పుడు సామాన్యశాస్త్రంతోపాటు అన్ని సబ్జెక్టులపై ఆసక్తి పెరిగింది.
-కె.శిరీష, ఎనిమిదో తరగతి
కార్పొరేట్‌కు దీటుగా...
విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది మా ధ్యేయం. ఈ- లెర్నింగ్‌తో పాఠ్యాంశాలపై స్పష్టత కలిగి స్తున్నాం.
- అన్నపూర్ణ, సామాన్యశాస్త్ర
ఉపాధ్యాయురాలు
బోధన సులభతరమైంది...
ఈ-లెర్నింగ్ పాఠశాలలో ప్రవేశపెట్టిన నాటి నుంచి విద్యార్థులకు బోధన సులభతరంగా మారింది. 6 నుంచి 9 తరగతులకు సంబంధించి తెలుగు, ఆంగ్లంతో పాటు అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ-లెర్నింగ్ ద్వారా బోధన జరుగుతోంది.
- అనసూయాదేవి, పాఠశాల
ప్రధానోపాధ్యాయురాలు