breaking news
Duterte
-
మిస్టర్ ప్రెసిడెంట్
‘మనిషి తిట్టినందుకు దేశాన్నే నాశనం చేసే దేవుడు.. మనిషవుతాడు కానీ, దేవుడౌతాడా’ అన్నాడు డ్యుటర్టే. దేవుణ్ని అతడు ‘స్టుపిడ్’ అని ఇప్పటికి వారం రోజులు అవుతోంది. ఇంతవరకు అతడు దేవుడికి గానీ, దేశానికి గానీ క్షమాపణ చెప్పలేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ‘స్టుపిడ్’ అనే మాట కామన్ అయిపోయింది. కామన్ అవడం అంటే తిట్టుస్థాయి నుంచి అధ్యక్షస్థాయికి చేరుకోవడం. ట్రంప్ రాకడకు ముందే ఈ లోకానికో ట్రంప్ ఉన్నాడు. ఉన్నా, తగిన పోలిక లేక అతడు పైకి తేల్లేదు. పేరు రోడ్రిగో డ్యుటర్టే. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. పదవిలో, వయసులో ట్రంప్ కన్నా ఏడాది పెద్ద. ట్రంప్ రాకడకు ముందే ఈ లోకంలో స్టుపిడ్ అనే మాట కూడా ఉంది. ఉండడానికి ఉంది కానీ, ట్రంప్, డ్యుటర్టే వచ్చాకే బాగా యూసేజ్‌లోకి వచ్చింది. స్టుపిడ్ అని ఎక్కడైనా వినబడితే అదిప్పుడు పౌరుల్ని పౌరులు తిట్టుకున్నదై ఉండకపోయే అవకాశాలే ఎక్కువ. ఇద్దరు దేశాధ్యక్షులు కనిపిస్తారు ఆ మాట వినిపించిన వైపు! డ్యుటర్టేతో పోలిస్తే ట్రంప్ నథింగ్. కానీ ట్రంప్ వచ్చాకే డ్యుటర్టే సమ్‌థింగ్ అయ్యాడు. ‘ఆసియా ట్రంప్’ అయ్యాడు. నిజానికి ట్రంప్‌ని అనాలి ‘అమెరికన్ డ్యుటర్టే’ అని. అంత పెద్ద నోరు డ్యుటర్టేది. ఒబామాను అతడు ‘సన్నాఫ్ ఎ వోర్’ అన్నాడు. పోప్ ఫ్రాన్సిస్నీ అదేమాట అన్నాడు! ఫిలిప్పీన్స్‌లోని యు.ఎస్.రాయబారిని ‘ఫాగెట్’ అన్నాడు. హోమో సెక్సువల్ అని! యు.ఎన్. జనరల్ సెక్రెటరీ బన్ కి–మూన్‌ని ‘సన్నాఫె బిచ్’ అన్నాడు. డ్యుటర్టే ఎంత పెద్దవాళ్లనైనా లెక్క చెయ్యడు. తనే పెద్ద అని కూడా అనుకోడు. ‘నా ముఖం నచ్చలేదా, పేల్చెయ్ నన్ను’ అని గన్ తీసి చేతికిస్తాడు. అవతలివాడి ముఖం నచ్చలేదా.. నచ్చలేదని చెప్పడు, గార్డ్ని పిలిచి ‘పేల్చేయ్ వాడిని’ అని గార్డ్ చేతిలో గన్ పెడతాడు. మరీ నచ్చకపోతే తనే గన్ తీసుకుంటాడు. లోపల ఎన్ని బులెట్లు ఉన్నాయని కూడా చూసుకోడు. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ కాక ముందు, చాలా ఏళ్ల క్రితం దావో సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు ముగ్గురు గన్మెన్లను కాల్చి చంపేశాడు డ్యుటర్టే. ‘‘ముగ్గురున్నారు కాబట్టి ముగ్గుర్నీ కాల్చేశాను. వాళ్ల బాడీలోకి ఎన్ని బులెట్లు దిగాయో మాత్రం నేను చెప్పలేను’’ అని ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాడు డ్యుటర్టే. ‘చట్టం ఉంది కదా’ అంటే, ‘చేతిలో గన్ లేకపోతే కదా’ అంటాడు. పైగా మేయర్. ఇంటికొచ్చిన అమ్మాయిల్ని ఇంట్లో అమ్మాయిల్లా రెప్పల్లో పెట్టుకోలేకపోతే నేనెందుకు ఉండేడ్చినట్లు అంటాడు. ఒక చైనా అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసినందుకు ఆ గన్మెన్లకు అతడు ఇన్‌స్టంట్‌గా విధించిన శిక్ష అది. ఇంకా చాలా కిల్లింగ్స్ ఉన్నాయి అతడి అకౌంట్లో. అధ్యక్షుడు అయ్యాక ‘వార్ ఆన్ డ్రగ్స్’ మొదలు పెట్టి ఇరవైవేల మందిని షూట్ చేయించాడు. మానవ హక్కులవాళ్లొచ్చారు. ‘ఎవరి హక్కుల గురించి మాట్లాడ్డానికొచ్చారు? క్రిమినల్స్ హక్కుల గురించేనా?! పొండవతలికి’ అని గన్ తీశాడు. మనిషి సాదాసీదాగా ఉంటాడు. కిందొక ప్యాంటు, పైనొక చొక్కా. ముఖం మీద నవ్వుండదు. ఉన్నట్లనిపిస్తుంది. మాటలో ఆచడం తూచడం ఏం ఉండదు. ‘వెళ్లిన చోట మీరేం చేసినా అది నామీద వేసుకుంటాను.. సరేనా? మీరు ముగ్గుర్ని రేప్ చేసినా మీ తరఫున నేను జైలుకెళతాను. కానీ నలుగుర్ని పెళ్లిచేసుకొస్తే మాత్రం ఊరుకోను’ అని పెద్దగా నవ్వి, సైనికుల్లో స్పిరిట్ నింపినవాడు డ్యుటర్టే. డ్యూటీ చేసినా జోక్‌గానే చెయ్యాలి. కానీ అది సీరియస్‌గా ఉండాలి అంటాడు! ఈమధ్య దేవుణ్ని కూడా అతడు జోక్‌గానే సీరియస్‌గా తిట్టాడు.. ‘స్టుపిడ్’ అని! దేవుడిలో డ్యుటర్టే్టకి కనిపించిన స్టుపిడిటీ.. ఆడమ్ అండ్ ఈవ్లను తనే సృష్టించి, వాళ్లు పాపపు ఆపిల్ తిని తప్పుచేశారని మళ్లీ తనే వాళ్లను శిక్షించడం. డ్యుటర్టే దేవుణ్ణి తిట్టినందుకు క్యాథలిక్ కంట్రీ హర్ట్ అయింది. ఫిలిప్పీన్స్‌లో తొంభై శాతం మంది క్రిస్టియన్లే. వాళ్లలో ఎక్కువమంది క్యాథలిక్కులే. ‘ఇతడేం ప్రెసిడెంటండీ! ప్రజల మత విశ్వాసాలను పట్టించుకోడా? అని అడిగారు బిషప్పులు. ‘డ్యుటర్టే క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే ఫిలిప్పీన్స్ సర్వనాశనం అయిపోతుంది’ అని హెచ్చరించారు మతపెద్దలు. ‘ఒక మనిషి తనని తిట్టినందుకు దేశాన్నే నాశనం చేసే దేవుడు.. మనిషవుతాడు కానీ, దేవుడౌతాడా’ అన్నాడు డ్యుటర్టే. దేవుణ్ని అతడు ‘స్టుపిడ్’ అని ఇప్పటికి వారం రోజులు అవుతోంది. ఇంతవరకు అతడు దేవుడికి గానీ, దేశానికి గానీ క్షమాపణ చెప్పలేదు. డ్యుటర్టేకి ఏమిటింత ధైర్యం?! అది ధైర్యం కాకపోవచ్చు. దేవుడంటే అతడికి ఉండే నమ్మకం కావచ్చు. కోపం వస్తే నోరు పారేసుకోడానికి, గన్ తీసి పేల్చడానికి దేవుడేం ‘డ్యుటర్టే’ కాదని తెలియనంత స్టుపిడేం కాకపోవచ్చు అతడు. - మాధవ్ శింగరాజు -
జనరంజక ‘నియంత’!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే రూటే సెపరేటు - డ్రగ్ డీలర్లు కనిపిస్తే కాల్చేయండి - అధ్యక్ష హోదాలో దేశ ప్రజలకు పిలుపు దవావో(ఫిలిప్పీన్స్) నుంచి సాక్షి ప్రతినిధి ‘‘డ్రగ్ డీలర్లనే కాదు, వాటికి బానిసలైన వారిని కూడా కనిపిస్తే కాల్చేయండి. మీపై ఏ కేసూ లేకుండా చూసుకుంటా. ప్రక్షాళనకు ఏకైక మార్గం మారణకాండే. ఓ లక్షమందినైనా చంపించేస్తా. వారి శవాల్ని చేపలకు ఆహారంగా మనీలా అఖాతంలో పాతరేయిస్తా. మంచి లాభాలు కళ్లజూడాలనుకునేవారు శ్మశానవాటికల వ్యాపారం పెట్టుకోండి. బ్రహ్మాండంగా సాగుతుంది. నాదీ హామీ!’’ ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరంటే నమ్మగలమా? కానీ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే ఇలాంటి విస్ఫోటక వ్యాఖ్యలకు పెట్టింది పేరు! డ్రగ్ మాఫియాను తిట్టిపోసినంత అలవోకగా కేథలిక్ మత పెద్దలు మొదలుకుని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితిపైనా బూతు పదజాలంతో విరుచుకుపడటం దుతర్తేకు వెన్నతో పెట్టిన విద్య. గురువారం దేశాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, ఆ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యతో చెలరేగారు. ‘పోలీసులతో పాటు అన్ని శాఖల్లోనూ అవినీతి పెచ్చరిల్లింది. దీన్ని ఇకపై సహించను. ఎవరైనా సరే, తాట తీస్తా’ అని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఫిలిప్పైన్వాసులు మాత్రం దుతర్తే అంటే పడిచస్తుంటారు. మే 9నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 60 లక్షల పై చిలుకు భారీ మెజారిటీతో ఆయనను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దుతర్తే సొంత పట్టణం దవావోలోని జనం బట్టల దగ్గరి నుంచి నడిపే వాహనాల దాకా అన్నింటిపైనా దుతర్తే ఫొటోలే! 71 ఏళ్ల దుతర్తే, ఫిలిప్పీన్స్ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అత్యంత పెద్ద వయస్కుడు. కానీ రూపంలో గానీ, మాటల్లో గానీ, చివరికి చేతల్లో గానీ ఆ వయోభారం మచ్చుకైనా కనిపించదు! దవావో మేయర్‌గా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన దుతర్తే... ఒకప్పుడు హత్యలకు, డ్రగ్స్ మాఫియాకు మారుపేరుగా ఉన్న నగరాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళించి ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల్లో టాప్ టెన్‌లో చేర్చారు. అయితే, అందుకోసం హంతక ముఠాలను నడిపారని, వందలాదిగా డ్రగ్ డీలర్లను చంపించారని అభియోగాలను ఎదుర్కొన్నారు! స్వయానా లా గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా ఇలా చట్టాలను అతిక్రమించడాన్ని, ప్రజలను కూడా అందుకు ప్రోత్సహించడాన్ని దుతర్తే స్టైల్ అని సరిపెట్టుకోవాల్సిందే.