మాస్టర్ ప్లాన్‌తో డెలీవరీ బాయ్‌గా వచ్చి..
బెంగళూరు: డెలీవరీ బాయ్‌గా వచ్చి ఇంటిని దోచేయాలనుకున్న ఓ దొంగ ఆటను ఆ ఇంటి గృహిణి సమర్థంగా కట్టించింది. కళ్లల్లో కారం కొట్టినా సాహసంతో అతడిని తనకు ఇచ్చిన పార్సిల్‌తో కొడుతూ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. దొంగ చివరకు భయంతో పరుగులు పెట్టినా కాలనీ వాసులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హెబ్బాల్ లోని బసవేశ్వర్ నగర్ కు సమీపంలోని ఓ కాలనీలో ఆశా సంతోష్ (38) అనే ఓ గృహిణి ఉంది. ఆమె ఇంటికి ఓ దొంగ డెలివరీ బాయ్‌గా వచ్చాడు.
చేతిలో నిజంగానే ఆమె భర్త పంపించినట్లుగా అడ్రస్ తో ఓ పార్సిల్ తో వచ్చాడు. బ్యాగ్ లో మాత్రం కత్తి, నోటికి వేసే ప్లాస్టర్, ఐరన్ రాడ్, మరికొన్ని పదునైన ఆయుధాలు, కారంపొడిని బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాడు. తొలుత కొంత అనుమానం వచ్చినప్పటికీ.. భర్త అడ్రస్ సరిగ్గా ఉండటంతో ఆమె నమ్మి తలుపు తీసింది. పార్సిల్ చేతిలో పెట్టినట్లు పెట్టిన అతడు వెంటనే కారంపొడి ఆమె ముఖంపై చల్లాడు. ఆమెను బలవంతంగా వేరేగదిలో పెట్టి తాళం వేసేందుకు ప్రయత్నించాడు.
అయితే, ఆమె తప్పించుకొని పార్సిల్ బాక్స్ తో అతడిని కొట్టడం మొదలుపెట్టింది. ఆ వెంటనే అరిచింది. దీంతో ఆ దొంగ పారిపోయి ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు పది నిమిషాల్లో మొత్తం కలియతిరిగి అతడిని గుర్తించారు. రాళ్లు విసిరి అతడిని కిందికి దించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిది తమిళనాడుగా గుర్తించారు.