సీలేరు విద్యుత్‌కు ఒడిశా నీరు
► రోజుకు 1000 క్యూసెక్కుల విడుదల
► ఇరు రాష్ట్రాల అధికారుల
► సమావేశంలో అంగీకారం
సీలేరు: విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఒడిశా వాటా నీటిని ఏపీకి విడుదల చేసేందుకు ఒడిశాలోని పొట్టేరు వాటర్ ఇరిగేషన్ శాఖ, బలిమెల హైడ్రల్ పవర్ ప్రాజెక్టు కార్పొరేషన్ అధికారులు అంగీకరించారని ఏపీ జెన్కో మోతుగూడెం చీఫ్ ఇంజనీర్ కేశవస్వామి తెలిపారు. ఒడిశాలోని బలిమెల ప్రాజెక్టు అతిథి గృహంలో నీటి పంపకాలపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగిందన్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసేవరకు గురువారం నుంచి బలిమెల రిజర్వాయర్ ద్వారా సీలేరుకు రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు తీసుకుంటామని చెప్పారు. బలిమెలలో ఏపీ వాటాగా చుక్క నీరు కూడా లేదని, దీంతో సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింద న్నారు.
ఈ పరిస్థితుల్లో ఒడిశా అధికారులను సంప్రదించగా నీరు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. ప్రస్తుతం బలిమెల రిజర్వాయర్‌లో ఒడిశా వాటాగా 50.6349 టీఎంసీల నీరుందని, ఈ పది రోజుల్లోనే అందులో 2.6390 టీఎంసీల నీరు ఇప్పటికే తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు కురిసే వరకు రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీరు తీసుకొని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జల విద్యుత్ కేంద్రాల్లో పీక్ అవర్స్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం గోదావరి ప్రాంతాలకు విడుదల చేస్తామని ఆయన వివరించారు. 2015-16 లో గోదావరి డెల్టాకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 50 టీఎంసీల నీటిని పంపించామని చెప్పారు. ఈ సమావేశంలో ఒడిశా అధికారులతో పాటు సీలేరు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.మురళీ మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఎల్ రమేష్, ఏడీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.