మార్కెటింగ్ గురు మోదీ | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్ గురు మోదీ

Published Mon, May 25 2015 2:19 AM

మార్కెటింగ్ గురు మోదీ - Sakshi

ఏడాది పాలనపై ధ్వజమెత్తిన కాంగ్రెస్
ప్రచారంలో దిట్టగా మారిన ప్రధాని
ఏడాదిగా ఎన్డీయే సర్కారు చేసింది శూన్యం
నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం

భోపాల్: ఎన్డీయే సర్కారు ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. ఈ ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్కెటింగ్ గురుగా ఎదిగారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది.

మోదీ సర్కారు పనితీరు శూన్యమని విమర్శించింది. అయితే మోదీ మాత్రం తన ప్రభుత్వ పనితీరు గొప్పగా ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తింది. ‘పనితీరు శూన్యమైనప్పటికీ వస్తువులను విక్రయించే నేర్పరితనాన్ని మోదీ సంపాదించార ’ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. గత యూపీఏ ప్రభుత్వ పథకాలనే కొత్తగా మలిచి వాటిని తెచ్చిన ఘనత తమదే అన్నట్లుగా మోదీ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.

ఆయన హయాంలో మాంసం ఎగుమతిలో మాత్రమే వృద్ధి నమోదైందని, ఏడాది కాలంలో 15 శాతం ఎక్కువ మాంసం ఎగుమతి అయిందని పేర్కొన్నారు. ఈ విషయంలో గతంలో యూపీఏను మోదీ తప్పుబట్టారని గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీయే సర్కారు పూర్తిగా విఫలమైందని, అధికార కేంద్రీకర ణ ఇందుకు కారణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ విమర్శించారు.

లోక్‌పాల్, సీవీసీ, సీఐసీ, డీఆర్‌డీవో, ఐసీఏఆర్, సీఎస్‌ఐఆర్ వంటి అనేక అత్యున్నత సంస్థలకు నేతృత్వం వహించే పోస్టులన్నీ చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని, 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్‌చాన్సలర్లు కూడా లేరని గుర్తుచేశారు. 76 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్ణయాత్మక అధికారం మోదీ ఒక్కరి చేతుల్లోనే ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.

ప్రధాని మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు ప్రచారం చేస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీతో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని ఆనంద్ శర్మ తప్పుబట్టారు. ఈ ఒప్పందం నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థను ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement