పోటీ చేయకుండా ఎమ్మెల్యే అయ్యాడు! | Sakshi
Sakshi News home page

పోటీ చేయకుండా ఎమ్మెల్యే అయ్యాడు!

Published Tue, Aug 30 2016 12:11 AM

పోటీ చేయకుండా ఎమ్మెల్యే అయ్యాడు!

తాళ్లరేవు : ‘ఫలానా నాయకుడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ‘హ్యాట్రిక్‌’ సాధించాడని, ఇంకొకాయన ఆరుసార్లు గెలిచి ‘డబుల్‌ హ్యాట్రిక్‌’ సాధించాడని వార్తలు చదువుతుంటాం. అయితే అసలు ఎన్నికల బరిలోకి దిగకుండా ఎమ్మెల్యే అయిన వ్యక్తి గురించి విన్నారా? పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉండి, జీవితాంతం అదే పేరుతో కొనసాగనున్న ఈ యువకుడి గురించిన ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి..

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని గోవలంకకు చెందిన 24 ఏళ్ల యువకుడి పేరు ఎమ్మెల్యే ఏడుకొండలు. ఇంటి పేరు ‘కాశి’. అంటే పూర్తిపేరు.. కాశి.ఎమ్మెల్యే ఏడుకొండలు. ఈపేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? అవును అదొక సినిమా పేరు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, ఆయనే ప్రధాన పాత్రలో నడించిన రాజకీయ వ్యంగ్య చిత్రం'ఎమ్మెల్యే ఏడుకొండలు' అప్పట్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. మన ఎమ్మెల్యే.. అదేనండి ఏడుకొండలు తండ్రి ధనరాజు.. దాసరికి వీరాభిమాని. అలా తన అభిమాన దర్శకుడి సినిమాల్లో తాను బెస్టుగా భావించే సినిమా పేరునే కొడుక్కిపెట్టుకున్నాడు. అలా పుట్టడంతోనే ఎమ్మెల్యే అయి.. తండ్రి కోరిక మేరకు ఎప్పటికైనా శాసనసభ్యుడు కావాలనుకుంటున్నాడు ఎమ్మెల్యే ఏడుకొండలు. అతని కల నెరవేరాలని కోరుకుందామా?

Advertisement

తప్పక చదవండి

Advertisement