‘ఇప్పటికైనా మా దేశానికి వచ్చి ఆడండి’

‘ఇప్పటికైనా మా దేశానికి వచ్చి ఆడండి’


లండన్‌: ‘ఈ రోజు పాకిస్థాన్‌ చరిత్రలో చాలా సంవత్సరాలపాటు గుర్తుండిపోతుంది’  అంటూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హర్షాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకున్న అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. ఇకనైనా పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకురావాలని అతను విజ్ఞప్తి చేశాడు. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి అనంతరం ఓ పెద్ద క్రికెట్‌ జట్టు కూడా పాకిస్థాన్‌లో ఆడేందుకు ముందుకు రాని సంగతి తెలిసిందే.‘మా ఆటగాళ్లు గొప్ప విజయాన్ని సాధించారు. ఈ క్రెడిట్‌ అంతా వారిదే. ఈ అద్భుత విజయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. చరిత్రలో ఎన్నో ఏళ్లు ఇది నిలిచిపోతుంది. గొప్ప ప్రేరణ ఇచ్చేవిధంగా మా ఆటగాళ్లు ఆడారు. ఎనిమిదో ర్యాంకు జట్టుగా అడుగుపెట్టి మేం టోర్నమెంటును కైవసం చేసుకున్నాం. ఇప్పటికైనే అన్నిదేశాలు ముందుకొచ్చి పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడుతాయని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)తో తాము గణనీయంగా లబ్ధి పొందినట్టు చెప్పాడు. కొంతకాలంగా పాక్‌ క్రికెట్‌ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని చెప్పాడు. ‘కొన్నేళ్లుగా స్వదేశీ మ్యాచులు మేం దుబాయ్‌లో ఆడుతూ వస్తున్నాం. అందువల్ల మిగతా జట్లకు ఉన్నట్టు మాకు స్వదేశీ అనుకూలత ఎప్పుడూ లభించలేదు. ఈ విజయం వల్లనైనా మిగతా జట్లు పాక్‌ వచ్చి క్రికెట్‌ ఆడుతాయని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ చెప్పాడు.

 

Back to Top