Sakshi News home page

‘నామినేటెడ్‌’ పదవుల పండుగ

Published Mon, Feb 27 2017 3:10 AM

‘నామినేటెడ్‌’ పదవుల పండుగ - Sakshi

- అసెంబ్లీకి ముందే 4,000 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ!
- మంత్రుల కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేబినెట్‌ మంత్రులంతా ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సోమ, మంగళ వారాల్లో జిల్లాల్లో నియోజక వర్గాల వారీగా సమావేశాలు జరపాలని ఇందులో నిర్ణయించారు. పాత జిల్లాల వారీగా పదవుల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేలోపే దాదాపు 4 వేల నామినేటెడ్‌ పదవుల భర్తీకీ శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా కార్పొరేషన్‌ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయలేదు. వాటితోపాటు జిల్లా స్థాయిలో పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవులు తప్ప జిల్లాల్లో ఇతర పోస్టులను భర్తీ చేయలేదు. దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీలతో పాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ డైరెక్టర్ల పదవులకు ఎంపిక జరగనుంది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, శాప్, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్లలో పోస్టులు భర్తీ చేయనున్నారు.

Advertisement
Advertisement