ఓసీలో బంకర్‌ కూలి ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

ఓసీలో బంకర్‌ కూలి ఇద్దరి మృతి

Published Wed, Apr 19 2017 12:19 AM

ఓసీలో బంకర్‌ కూలి ఇద్దరి మృతి - Sakshi

మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం

మణుగూరు రూరల్‌ (పినపాక): భద్రాచలం కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్టు గనిలో బంకర్‌ కూలి మంగళవారం ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. బంకర్‌లో బదిలీ కోల్‌ఫిల్లర్‌ బి.పవన్‌కుమార్‌(31), జనరల్‌ మజ్దూర్‌ దేశి రెడ్డి రçఘుపాల్‌రెడ్డి(32) బొగ్గును లారీలో లోడ్‌ చేస్తుండగా బంక్‌ బెడ్‌ కూలిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక కార్మికులు అ«ధికారులకు సమాచారం అందించగా ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్‌ తదితరులు వచ్చి బంకర్‌ కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీయించారు.

వారసత్వ ఉద్యోగాల ద్వారా ఎంపికైన పవన్‌కుమార్‌ ఐదేళ్ల క్రితం, రఘుపాల్‌రెడ్డి ఏడాదిన్నర క్రితమే సింగరేణి సంస్థలో చేరారు. తొలుత శ్రీరాంపూర్‌లో విధుల్లో చేరిన వీరు నాలుగు నెలల క్రితమే స్వగ్రామమైన మణుగూరు ఏరియాకు వచ్చారు. కాగా, పవన్‌కుమార్‌ సోమవారం వరకు కొండాపురం పంచ్‌ ఎంట్రీలో విధులు నిర్వర్తించాడు. మంగళవారం ఫస్ట్‌ షిఫ్ట్‌లోనే మణుగూరు ఓసీలో చేరాడు. ఇక్కడ విధుల్లో చేరిన నాలుగు గంటల్లోనే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, బంకర్‌లో ఓవర్‌లోడ్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మోడల్‌ పేరుతో నాణ్యతకు తిలోదకాలు..
మణుగూరులో 40 రోజుల్లోనే బంకర్‌ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలవాలని సింగరేణి అధికారులు భావించారు. అయితే నిర్మాణ సమయంలో నాణ్యత పాటించలేదని, త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో పనులు సక్రమంగా చేపట్టలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అందుకే బంకర్‌ ప్రారంభించిన నెల రోజులకే కూలిపోయిందని అంటున్నారు.

Advertisement
Advertisement