బాలిక దారుణ హత్య | The brutal murder of girl | Sakshi
Sakshi News home page

బాలిక దారుణ హత్య

Jul 31 2016 4:02 AM | Updated on Aug 21 2018 5:54 PM

బాలిక దారుణ హత్య - Sakshi

బాలిక దారుణ హత్య

ఓ గుర్తుతెలియని బాలికను దుండగులు అతి కిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.

- పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు
- మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన
 
 గోపాల్‌పేట : ఓ గుర్తుతెలియని బాలికను దుండగులు అతి కిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.  స్థానికం గా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది.   గుర్తు తెలియని బాలిక(14)ను ఎక్కడో చంపి తాడిపర్తి సమీపంలోని ప్రధాన రహదారి పక్కనుంచి జమ్మికుంటకు వెళ్లే దారిలో వ్యవసాయ పొలంలో పడేసి నిప్పంటించారు. శనివారం  అటువైపు వెళ్తున్న కొందరు రైతులు గమనించి గ్రామస్తులకు విషయం తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వనపర్తి టౌన్ ఎస్‌ఐ గాంధీనాయక్, గోపాల్‌పేట ఏఎస్‌ఐ ఇలియాజ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

నీళ్లు పోయించి మంటలను ఆర్పించారు. తెల్లవారుజామునే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మృతదేహం పక్కనే మోటార్ సైకిల్ టైరు గుర్తులున్నాయి. బైకుపై తీసుకొచ్చి ఉంటారని, శరీ రంపై బురఖా ధరించి ఉండటంతో ముస్లిం బాలికగా పోలీసులు భావిస్తున్నారు. బాలిక ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. మృతదేహం పక్కనే బెడ్‌షీట్, చున్నీ, లోదుస్తులు, ఓ చిన్న కత్తి పడి ఉంది. కుడికాలి బోటన వేలు పూర్తిగా రాసుకుపోయి ఉంది. మృతదేహాన్ని బైకుపై తీసుకొచ్చేవేళ రోడ్డుపై రాసుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

 తలపై కొట్టి.. ఆపై ఈడ్చుకొచ్చి
 మృతురాలి కుడి చేతికి ఓ ఎర్రని దారం ఉంది. తల వెనుక భాగంలో బలమైన రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. తలపై కొట్టిచంపి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బెడ్‌షీట్, దుస్తులు ఉండటంతో బాలికను హాస్టల్ నుంచిగానీ, ఇంటినుంచి గానీ తీసుకువచ్చారా, ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలను గుర్తించడం కోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారమిచ్చి మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement