'ఆయన చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?' | Sakshi
Sakshi News home page

'ఆయన చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?'

Published Fri, Sep 15 2017 1:40 PM

'ఆయన చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?' - Sakshi

కరీంనగర్‌ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయడం అనైతికం కాదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయనిక్కడ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏమి చేసినా సంసారం అవుతుంది..ఇతరులు ఏది చేసినా వ్యభిచారంలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు.
 
ఎన్నికల ముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. తప్పుడు ప్రచారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి, కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేస్తున్నాయని తెలిపారు. ఎజెండాలు, అజెండాలు ప్రక్కనపెట్టి కార్మికుల సంక్షేమం కోసం కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.
 
సింగరేణిలో ఓట్లు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ కార్మికుడిపై ఉందన్నారు. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఓడితే ఉత్తర తెలంగాణలో ప్రత్యక్షంగా 14 పరోక్షంగా 50 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందన్నారు

Advertisement
Advertisement