అర్హులకు అన్యాయం | Sakshi
Sakshi News home page

అర్హులకు అన్యాయం

Published Mon, Oct 23 2017 11:52 AM

resurvey on double bed room homes - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మురికి వాడల్లో అసౌకర్యాల మధ్య నివసిస్తున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణం వరంగా మారినప్పటికీ పాలమూరులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2015 జనవరి 18న పట్టణంలో పర్యటించిన సీఎం ఇక్కడి పరిస్థితులకు చలించిపోయారు. పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట వీధులను చుట్టొచ్చిన ముఖ్యమంత్రి అప్పట్లో ఎందరో నిరుపేద కుటుంబాల యజమానులను పలుకరించి రెండు పడకల ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
 
ఇదీ అసలు విషయం..
రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం అనేకసార్లు సర్వేలు చేశారు. వాస్తవానికి ఇల్లు గానీ, ప్లాట్లు గానీ లేని వారిని గుర్తించి వారి పేర్లను లక్కీ డిప్‌లో వేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల డబుల్‌ ఇళ్ల కోసం నిర్వహించిన లక్కీ డిప్‌ వివరాలను పరిశీలిస్తే ఉన్న వారికే ఇళ్లు వచ్చాయి. లేని వారికి అన్యాయం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా భుజంతట్టి హామీ ఇచ్చిన పాతపాలమూరు కొమ్మూరు చంద్రయ్యకు లక్కీ డిప్‌లో ఇల్లు లభించలేదు. ఈ విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. డిప్‌ నిర్వహించిన అధికారులు ఇళ్లు కూల్చుకొని ఎదురు చూస్తున్న వారికి.. పాతపాలమూరులో ఉన్న వారందరి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డిప్‌లో వేయడంతో నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు కాలేదు. దీంతో చాలామంది అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారుల సర్వేపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకు సర్వే పారదర్శకంగా నిర్వహించారా.. లేక ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గి డిప్‌లో పేర్లు వేయించారనే విషయం తెలియాల్సి ఉంది.  

త్వరలో రీ సర్వే?
ఇదిలాఉండగా డబుల్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల లక్కీడిప్‌పై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో పాటు ఆందోళనల నేపథ్యంలో లక్కీడిప్‌లో ప్రకటించిన లబ్ధిదారుల జాబితాపై రీ సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్డీఓ లక్ష్మినారాయణ, తహసీల్దార్‌ ఎంవీ ప్రభాకర్‌రావులు మరోసారి లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి నిజమైన అర్హులకు డబుల్‌ ఇళ్లు అందేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదేగనక జరిగితే కొంతలో కొంత పేదలకు న్యాయం జరిగే అవకాశం లేకపోలేదు.

Advertisement
Advertisement