కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 8 2019 1:45 AM

KCR On Timber Smuggling In Telangana Forest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలప అక్రమ రవాణాకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అధికారులను ఆదేశించారు. కలప అక్రమ రవాణా చేసే వారిపై పోలీసుల సాయంతో ఉక్కుపాదం మోపాలని చెప్పారు. తరచూ కలప అక్రమ రవాణా చేసే స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ అక్రమ రవాణాదారులు ఎంతటి వారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవీ పునరుద్ధరణ, హైదరాబాద్‌ నగరం లోపల బయట పచ్చదనం పెంచడం, కలప అక్రమ రవాణాను అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.‘అడవుల్లో సహజంగా చెట్లు పెరుగుతాయి. వాటి ద్వారా లభించే పచ్చదనమే ఎక్కువ. ఓ వైపు అడవులు నశించిపోతుంటే... హరితహారం వంటి వాటితో ఎన్ని చెట్లు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

అడవులను కాపాడడమంటే, భూమిధర్మాన్ని కాపాడినట్లే. కలప స్మగ్లింగ్‌ వల్ల అడవులకు పెద్ద ముప్పు వాటిల్లుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది.కొందరు ఇదే పనిగా పెట్టుకున్నారు.అలాంటి ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించాలి. అక్కడ నిబద్ధత కలిగిన అధికారులను నియమించాలి. ఈ స్మగ్లింగ్‌ అరికట్టడమే లక్ష్యంగా వారు పనిచేయాలి. పోలీసుల సహకారంతో అటవీశాఖ కార్యాచరణ రూపొందించాలి.సాయుధ పోలీసుల అండతో ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలి.స్మగ్లర్లు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు.కఠిన చర్యలు తీసుకోవాలి.వారికి సహకరించే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి.రాజకీయ నేతలు ఎవరైనా స్మగ్లింగ్‌కు పాల్పడినా వదలొద్దు. టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోండి. గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదు అని సాకులు చెప్పేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. అడవులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయండి. పోలీస్, అటవీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు.  

అధికారులే ఇస్తామంటున్నారు... 
‘కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇండ్లు నిర్మించుకునే సందర్భంలో ఎంత కావాలంటే అంత కలప అందిస్తామని కొందరు అధికారులు తరచూ చెపుతుంటారు.ఇలాంటి అక్రమాన్ని అరికట్టాలి.కట్టె కోత మిల్లుల (సామిల్స్‌)ల నిర్వహణపైనా నియంత్రణ ఉండాలి. కొత్తగా ఎలాంటి మిల్లులకు అనుమతి ఇవ్వవద్దు. అడవులను రక్షిస్తూనే... చెట్ల నరకివేత వల్ల పోయిన అడవిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. రూట్‌ స్టాక్‌ను ఉపయోగించుకుని అడవుల పునరుద్ధరణ చేపట్టాలి. సామాజిక అడవుల అభివృద్ధి కన్నా, అటవీ ప్రాంతంలో అడవి పెంచడం సులువు. హరితహారం కింద ఏటా నాటే మొక్కల సంఖ్యను పెంచాలి. వచ్చే వర్షాకాలం నుంచి ఏడాదికి వంద కోట్ల వంతున మొక్కలు నాటాలి.దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. హైదరాబాద్‌ నగరం పరిధిలో లక్షా 50 వేల ఎకరాల అటవీ బ్లాకులు ఉన్నా అందులో చెట్లులేవు. ఈ బ్లాకుల్లో పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రస్తుతం విపరీతమైన వాయు కాలుష్యం ఉంది.

చెట్లు లేకపోవడం, వాహన కాలుష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ నగరంలోనూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించాలంటే చెట్లు పెంచడం ఒక్కటే మార్గం. అన్ని పార్కులు, అటవీ బ్లాకుల్లో విరివిగా చెట్లు పెంచాలి. వాటిలో వాకింగ్‌ పాత్‌లు కూడా నిర్మించి ఉపయోగంలోకి తేవాలి. ఈ కార్యక్రమానికి నిధుల కొరత లేదు. ఉపాధి హామీ, కాంపా, బడ్జెట్, నగర పాలక సంస్థల నిధులు అందుబాటులో ఉన్నాయి. చిత్తశుద్ధితో పనిచేయాలి’అని సీఎం కేసీఆర్‌ సూచించారు.హోం మంత్రి మహమూద్‌అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి పి.కె.ఝా, ఉన్నతాధికారులు ఎస్‌.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, రాజీవ్‌త్రివేది, నిరంజన్‌రావు, స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రియాంకవర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement