వారిపై దాడులు సరికావు : ఈటెల | Sakshi
Sakshi News home page

వారిపై దాడులు సరికావు : ఈటెల

Published Thu, Feb 28 2019 11:34 AM

Health Minister Etela Rajender Serious Over Attack On Doctor - Sakshi

సాక్షి, హైదరాబాద్ : సకాలంలో వైద్యం అందించాలనే డాక్టర్లు కృషి చేస్తారని, అలాంటి వారిపై దాడులు సరికావని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ తెలిపారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం చేసే డాక్టర్లపై దాడులు సరికాదన్నారు. అందుబాటులో ఉన్న వైద్యులు పేషంట్లకు వైద్యం అందిస్తారని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కొత్త, కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. మొత్తం దేశంలో కేరళ, తమిళనాడు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడించారు. తన సహచర మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి అనేక పనులు చేశారని చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుండాలని లక్ష్మారెడ్డి కోరుకున్నట్లు చెప్పారు. ‘ఎంత ఖర్చైనా పెట్టండి. కానీ పేదవారందరికి నాణ్యమైన వైద్యం అందాల’ని కేసీఆర్ చెప్పారని తెలిపారు.

మంత్రి గాంధీ ఆస్పత్రికి రావాలి : జూడాలు
తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి ఆందోళన, ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా గాంధీ జూడాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ గాంధీ ఆస్పత్రికే రావాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జరిపే చర్చలు గాంధీ ఆసుపత్రిలోనే జరగాలని వారు పట్టుబట్టారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement