బెల్గాంలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

బెల్గాంలో ఉద్రిక్తత

Published Tue, Jun 10 2014 3:15 AM

Hubli tension

  • అశ్లీల చిత్రాలు తెచ్చిన తంటా!
  •  రెండు వర్గాల మధ్య ఘర్షణ
  •  నిషేధాజ్ఞలు జారీ
  •  అదనపు పోలీసు బలగాల మొహరింపు
  •  ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం
  • బెంగళూరు : బెల్గాంలో మళ్లీ మత ఘర్షణలు రగలాయి. ఓ వర్గానికి చెందిన వారి అశ్లీల చిత్రాలు గీసి పోస్టర్లు అతికించడంతో ఘర్షణ చెలరేగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో బెల్గాంలో నిషేధాజ్ఞలు విధించారు. సీనియర్ పోలీస్ అధికారులు బెల్గాం రహదారులపై మకాం వేశారు. ఆదివారం రాత్రి పోస్టర్లను గుర్తించిన ఓ సామాజిక వర్గం ఆగ్రహంతో రెచ్చిపోయింది. అదే సమయంలో మరో వర్గానికి చెందిన వారు గుంపుగా చేరడంతో పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి.

    క్షణాల్లో ఈ వివాదం బెల్గాంలోని సున్నిత ప్రాంతాలకు పాకిపోయింది. తోరలాగిదె, జాలగార  దర్బార, చెవాట, ఖడక్, బడకల, మాళి, కలెగార, ఖంజర తదితర ప్రాంతాల్లో పరస్పరం రాళ్వు రువ్వుకున్నారు.  పలు ప్రాంతాల్లోని ఇళ్ల కిటికీ అద్దాలు, తలుపులు దెబ్బతిన్నాయి. పదికి పైగా బైక్‌లు, కార్లు ధ్వంసమయ్యాయి.

    సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా వివాదస్పద ప్రాంతాలకు చేరుకుని ఇరు సామాజిక వర్గాలకు నచ్చచెప్పేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితి విషమిస్తుండడంతో లాటీలకు పనిచెప్పారు. సోమవారం ఉదయం ఇరు వర్గాల పెద్దలను పోలీస్ అధికారులు పిలిపించి రాజీ యత్నం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో అదనపు పోలీసు బలగాలను మొహరింప చేశారు.
     

Advertisement
Advertisement