భారత్ ప్రాక్టీస్: ఫీల్డింగ్‌కే పరిమితం | Sakshi
Sakshi News home page

భారత్ ప్రాక్టీస్: ఫీల్డింగ్‌కే పరిమితం

Published Thu, Feb 26 2015 12:28 AM

భారత్ ప్రాక్టీస్: ఫీల్డింగ్‌కే పరిమితం

పెర్త్: దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం తర్వాత రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న భారత క్రికెటర్లు బుధవారం మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టారు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా సీరియస్ నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌లతో కలిసి కొద్దిసేపు ఫీల్డింగ్‌లో మాత్రం సాధన చేశారు.
 
 దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ తర్వాత ఉత్సాహం మరింత పెరిగినట్లుంది కాబోలు... కొత్త తరహాలో ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ముందుగా ‘డమ్మీ క్యాచ్’లను ప్రాక్టీస్ చేశారు. నలుగురు ఫీల్డర్లు వరుసగా నిలబడి ఉండగా, బంగర్ టెన్నిస్ రాకెట్‌తో షాట్లు ఆడారు. అయితే అది నేరుగా ఏ ఫీల్డర్ కూడా పట్టరాదు. బంతికి దగ్గరిలో ఉన్న ఫీల్డర్ దానిని అందుకునే ప్రయత్నం చేసినట్లుగా నటిస్తూ, ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకోవాలి. ఆ తర్వాత లిప్తపాటులో దానిని గ్రహించి వెనక ఉన్న ఆటగాడు క్యాచ్ తీసుకోవాల్సి ఉంటుంది. స్లిప్‌లలో ఏమరుపాటుగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది.  క్యాచింగ్ ప్రాక్టీస్ తర్వాత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ‘ఫీల్డింగ్ మ్యాచ్’ కూడా ఆడారు.
 

Advertisement
Advertisement