విండీస్ స్పిన్నర్ నరైన్‌పై వేటు | Sakshi
Sakshi News home page

విండీస్ స్పిన్నర్ నరైన్‌పై వేటు

Published Mon, Nov 30 2015 1:05 AM

విండీస్ స్పిన్నర్ నరైన్‌పై వేటు

బౌలింగ్ శైలి సందేహాస్పదమని నిర్ధారించిన ఐసీసీ
 దుబాయ్: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. ఇక నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అడ్డుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నెల ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో నరైన్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 17న లాబోర్గ్‌లోని ఐసీసీ అక్రిడేటెడ్ ల్యాబ్‌లో స్పిన్నర్ బౌలింగ్‌ను పరీక్షించారు.
 
 బంతులు విసిరేటప్పుడు నరైన్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని తేలింది. ఐసీసీ ఆర్టికల్ 6.1 ప్రకారం ఇది బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంకావడంతో సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని అన్ని క్రికెట్ సంఘాలు గుర్తించాలని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో దేశవాళీ లీగ్‌ల్లోనూ నరైన్ ఆడటం అనుమానంగా మారింది. ఇక నరైన్ భవిష్యత్ మొత్తం విండీస్ బోర్డుపైనే ఆధారపడి ఉంది. అయితే బౌలింగ్ యాక్షన్‌ను సరి చేసుకున్న తర్వాత నిబంధన 2.4 ప్రకారం తనను మరోసారి పరీక్షించాలని నరైన్ ఐసీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement