తొలిరోజు ఆసీస్‌దే | Sakshi
Sakshi News home page

తొలిరోజు ఆసీస్‌దే

Published Fri, Dec 14 2018 4:17 PM

Bowlers Help India Bounce Back But Australia Still On Top - Sakshi

పెర్త్‌: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(16 బ్యాటింగ్‌; 34 బంతుల్లో 2 ఫోర్లు), ప్యాట్‌ కమిన్స్‌(11 బ్యాటింగ్‌; 29 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో  ఆస్ట్రేలియా  ఇన్నింగ్స్‌ను మార్కస్‌ హారిస్‌- అరోన్‌ ఫించ్‌లు ఘనంగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించిన తర్వాత ఫించ్‌(50; 105 బంతుల్లో 6 ఫోర్లు) ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఖవాజా(5), హారిస్‌(70; 141 బంతుల్లో 10 ఫోర్లు) పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ 134 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది.

మరో 14 పరుగుల వ్యవధిలో ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో హ్యాండ్స్‌ కోంబ్‌(7) ఔటయ్యాడు. విరాట్‌ కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో హ్యాండ్స్‌ కోంబ్‌ భారంగా పెవిలియన్‌ చేరాడు.  ఆ తరుణంలో షాన్‌ మార్ష్‌- ట్రావిస్‌ హెడ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేయత్నం చేసింది. ఈ జోడి 84 జత చేసిన తర్వాత మార్ష్‌(45;98 బంతుల్లో 6 ఫోర్లు) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం ట్రావిస్‌ హెడ్‌(58; 80 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, హనుమ విహారిలు తలో రెండు వికెట్లు సాధించగా, బూమ్రా, ఉమేశ్‌ యాదవ్‌లు చెరో వికెట్‌ తీశారు. కీలక సమయంలో భారత బౌలర్లు రాణించినప్పటికీ, ఆట ముగిసే సమయానికి మాత్రం ఆసీస్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

Advertisement
Advertisement