4ఏళ్లలో..ఇవే బాబు పథకాలు | Sakshi
Sakshi News home page

4ఏళ్లలో..ఇవే బాబు పథకాలు

Published Thu, Jun 21 2018 2:32 AM

YS Jaganmohan Reddy Fires on CM Chandrababu At Rajolu - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు ఈ నాలుగేళ్లలో దోపిడీ, అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, మోసాలు అనే పథకాలతో పాలన సాగించారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. బాబు ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం దండగేనని రైతులంటున్నారని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 194వ రోజు బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఈ పెద్దమనిషికి అన్నీ గుర్తుకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
కోనసీమ.. కష్టాల సీమ.. 
కోనసీమ అంటే బయట ప్రపంచానికి చాలా సంపదలున్న ప్రాంతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. రబీ సీజన్‌లో సాగు నీరు అందడం లేదు. కొబ్బరికి స్థిరంగా ధర లేదు. పరిశ్రమలు లేవు. కనీసం తాగేందుకు నీరూ లేని దుస్థితి. బతకడానికి జిల్లా కాదు.. ఏకంగా దేశాన్నే వదలి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. అందుకే ‘అన్నా.. బాబు వస్తే మాకు నీళ్లు రావు, మా పంటలకు రేట్లు ఉండవు, రుణాలు రావు, వడ్డీ రాయితీ ఉండదన్నా.. బాబు వస్తే వ్యవసాయమే దండగగా మారుతుందన్నా.. రైతు ఇల్లు గుల్లవుతుందన్నా..’ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రబీ సీజన్‌లో ఈ నియోజకవర్గంలో 35 వేల ఎకరాల ఆయకట్టు శివారు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా, కాల్వలు పూడుకుపోయినా పట్టించుకునే నాథుడు లేడు. చింతలపల్లి, శంకరగుప్తం, కత్తిమండ, గూడపల్లె, జి.పల్లిపాలెం, గుబ్బలపాలెం ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి పంటలు పండించి మార్కెట్‌కు తీసుకువెళితే అక్కడ రేటు ఉండదు. వరి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1550 అయితే రూ.1130కి కూడా కొనే నాథుడు లేడు.

కొనుగోలు కేంద్రాలను హాస్యాస్పదంగా మార్చారు. ధాన్యం పూర్తిగా వ్యాపారుల చేతికి వెళ్లాక నామ్‌కేవాస్తే కొనుగోలు కేంద్రాలు తెరుస్తారు. టీడీపీ నాయకులకు, వాళ్ల బినామీలకు మాత్రమే ధర వస్తుంది. ‘అన్నా.. చంద్రబాబు సీఎం అయ్యాక మా ఖర్మ చూడండన్నా.. రెండున్నర ఏళ్లలో కొబ్బరి రేటు రూ.4500 తగ్గిపోయిందన్నా. వేయి కొబ్బరి కాయలకు రూ.14 వేలు రావాల్సి ఉంటే ఈ ఏడాది అది రూ.9 వేలకు, కొబ్బరి క్వింటాల్‌కు రూ.15 వేలు రావాల్సి ఉంటే ఇప్పుడది రూ.12 వేలకు పడిపోయింది. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలన్నా..’ అని రైతులు వాపోతున్నారు. కొబ్బరి కాయ దింపుడు, వలుపు కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి కాయకు అర్ధ రూపాయి కూడా కూలి గిట్టడం లేదు. దీంతో వారు వలస బాట పడుతున్నారు. మాకే గిట్టుబాటు కాకుంటే వారికి ఏమి న్యాయం చేయగలమన్నా.. అని రైతులు అంటున్నారు. మరోపక్క కొబ్బరిపై జీఎస్‌టీ రూపంలో 5 శాతం ట్యాక్స్‌ వేశారు. దాన్ని తీసేయమని కేంద్రాన్ని అడగడానికి చంద్రబాబుకు మనసు రాదు. ఆయన అడగడు, కేంద్రాన్ని నిలదీయడు. ఈ పరిస్థితుల్లో రైతులు నాన్నగారి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. కొబ్బరిపై ఉన్న 4 శాతం పన్నును రద్దు చేయమని ఆవేళ రైతులు అడిగిన వెంటనే మరోమాట మాట్లాడకుండా నాన్నగారు రద్దు చేశారని చెబుతున్నారు. తమలపాకు రైతులదీ అదే పరిస్థితి. ఒక్కో మోద (తమలపాకుల కట్ట) రూ.8 నుంచి రూ.15 మధ్య పలుకుతుందట. కనీసం రూ.35 అయితే తప్ప గిట్టుబాటు కాదన్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో 20 మోదలుండే బుట్టపై రూ.20 వరకు కమీషన్‌ రూపంలో దోచుకుంటున్నారని చెబుతుంటే బాధనిపించింది.   
 
రొయ్యలకూ రేటు లేదు.. 
చంద్రబాబు పాలనలో భూమిపై పంటలకే కాదు నీళ్లలోని చేపలు, రొయ్యలకు కూడా రేట్లు లేవని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 10 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఆక్వా రైతుల బాధలు చూసి నేను.. రొయ్యల రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంటు ఇస్తానని చెబితేగాని చంద్రబాబుకు ఆక్వా రైతులు గుర్తుకు రాలేదు. అప్పుడు హడావిడిగా రూ.2కు కరెంట్‌ ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సరుగుడు రైతుల పరిస్థితి అలాగే ఉంది. రూ.12 వేలు ఉన్న టన్ను సరుగుడు ఇవాళ రూ.6 వేలు కూడా లేదు. దళారీలకు చంద్రబాబే నాయకుడిగా ఉండటమే ఈ పరిస్థితికి కారణం. మన ఖర్మ ఏమిటంటే ఆయనకు హెరిటేజ్‌ అనే సొంత కంపెనీ ఉంది. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్‌ చేసి మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. సొంత లాభాలు పెంచుకునేందుకు దళారీలకు నాయకత్వం వహించి రైతులకు ధర లేకుండా చేస్తున్నారు.   
 
గల్ఫ్‌ బాధితుల గోడు పట్టని సర్కారు 
ఈ ప్రాంతంలోని పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల నుంచి దాదాపు 40 వేల మంది గల్ఫ్‌ దేశాలకు వలస పోతే వారి బాగోగులు కూడా పట్టించుకోని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ యాత్రలో నన్ను నలుగురైదుగురు కలిసి గల్ఫ్‌లో వాళ్లు పడిన ఇక్కట్లను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సురేష్‌ గౌడ్‌ అనే యువకుడు నన్ను కలిసి గల్ఫ్‌ దేశాల్లో మనవారు పడుతున్న బాధల్ని చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘అన్నా.. నేను గల్ఫ్‌ నుంచి ఎలా తిరిగి వచ్చానో తెలియదన్నా.. నాలాంటి వాళ్లు వేలాది మంది గల్ఫ్‌లో అవస్థలు పడుతున్నారన్నా.. మీరన్నా పట్టించుకోవాలన్నా..’ అని కోరాడు. మొన్ననే ఒకాయన తన చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చి నన్ను కలిసి.. తన భార్య గల్ఫ్‌లో ఇరుక్కుపోయిందని, ఆమె బతికుందో లేదో కూడా తెలియడం లేదన్నా అని చెప్పాడు. ఆ వెంటనే నేను మా ఎంపీ విజయసాయిరెడ్డికి చెప్పి ఆమె జాడ గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి ఆచూకీ కనుక్కోమని చెప్పాను.  
 
బోర్లు వేస్తే ఉప్పునీళ్లే.... 
పక్కనే గోదావరి పోతున్నా రాజోలు ప్రాంతంలో మాత్రం తాగడానికి నీళ్లు లేవు. బోర్లు వేస్తే ఉప్పునీరు. ఆయిల్‌ కంపెనీల కారణంగా కలుషిత నీరు వస్తోంది. చివరకు ఆ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వేసిన నీటి పథకాలను సైతం సరిగా పని చేయించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గుడిమెల్లంక నుంచి పైప్‌లైన్‌ వేసి మల్కీపురం, సఖినేటిపల్లికి ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లకు నీటిని పంప్‌ చేసి మంచి నీటిని సరఫరా చేశారు ఆరోజుల్లో. ఆ మహానేత చనిపోయిన తర్వాత వాటిని నడపలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. వైఎస్సార్‌ హయాంలోనే రామేశ్వరం, అంతర్వేదిపాలెం తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి దాహర్తి తీర్చారు. ఈ పథకాలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్‌ హయాంలోనే ఇదే రాజోలులో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైతే ఇప్పుడది మూతపడే పరిస్థితిలో ఉంది. రాజోలులో 50 పడకల ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో కనీసం జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌ లేరు. ఎవరైనా గర్భవతి వస్తే పరీక్షించేందుకు గైనకాలజిస్టు కూడా లేని దుస్థితి. ఈవేళ నా వద్దకు 108 ఉద్యోగులు వచ్చారు. అన్నా.. నాన్నగారి హయాంలో మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేది. ఇవాళ నియోజకవర్గానికి ఒక్కటి కూడా లేదన్నా.. రాజోలుకున్న ఒకే ఒక అంబులెన్స్‌ రిపేరింగ్‌ షెడ్‌లో ఉందన్నా.. అని చెప్పారు. జీతాల మోహం చూసి రెండు నెలలు అవుతుందని సిబ్బంది చెబుతుంటే రాష్ట్రంలో పాలనలో ఏ స్థితిలో ఉందో తెలుస్తోంది.  
 
అనగనగా ఒక విద్యార్థి.. 
చంద్రబాబు తీరుపై ఓ పిట్టకథ చెబుతా.. చంద్రబాబు మాదిరిగా ఓ విద్యార్థి ఉండేవాడు. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు. మూడు గంటల పరీక్షలో గంట, గంటన్నర, రెండు గంటలు, రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్నాడు. తీరా పరీక్ష సమయం ముగుస్తుండగా, ఇన్విజిలేటర్‌గా ఉన్న మాస్టారు దగ్గరికొచ్చి.. ‘మాస్టారూ.. మాస్టారూ.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష రాస్తాను’ అన్నాడట. విద్యార్థి తీరుకు విస్తుపోయిన మాస్టారు.. ‘మరి ఇంతసేపు ఏం చేశావయ్యా!’ అని నిలదీశారట. అప్పుడా విద్యార్థి.. ‘మాష్టారూ, మీరు మూడు గంటలు సమయం ఇస్తే ఇప్పుడే పరీక్ష రాస్తా.. మీరు రెండు రోజులు సమయం ఇస్తే ఇంకా బాగా రాస్తా, నెల టైమిచ్చి మీరు సహకరిస్తే వందకు వంద తెచ్చుకుని స్టేట్‌ ఫస్ట్‌ వస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొస్తా..’ అన్నాడట. (సభలో నవ్వులు, కేరింతలు) 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్‌ వన్‌ చేస్తానంటున్న చంద్రబాబు ఈ కథలో విద్యార్థి. ఆయన్ను మాస్టారుగా నిలదీసింది ప్రజలు. 
  
నాలుగేళ్లుగా అన్నీ మోసాలే.. 
చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలనలో దోపిడీ, మోసం, అవినీతి, అరాచకం, అబద్ధాలు. ఈ ఐదు సీన్లు గ్రామాల నుంచి రాజధాని వరకు అమలు చేశాడు. మొట్టమొదటి సంతకం రైతుల రూ.87612 కోట్ల రుణమాఫీ అన్నాడు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు వ్యవసాయం మాత్రం మాఫీ అయింది. ఆయన గారి రుణమాఫీ పథకం రైతుల అప్పులకు అయిన వడ్డీకి కూడా సరిపోక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏదీ లేదు. ఈ 50 నెలలకు ఇంటింటికీ రూ.లక్ష బకాయి పడ్డారు. ఆరు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని.. కోటీ డెబ్బై లక్షల ఇళ్లకుగాను పది లక్షల ఇళ్లకు భృతి ఇస్తారట. అది కూడా రూ.వెయ్యేనట. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఎన్నికలప్పుడు ఈ పెద్దమనిషి ఇచ్చిన టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్లు మీకందరికీ గుర్తున్నాయా? బ్యాంకు సిబ్బంది వచ్చి మహిళా సంఘం బోర్డు పీకేసి మంగళ సూత్రం లాక్కోబోతుంటే.. ఆ అక్క ఏడుస్తూ ఓ నెల రోజులు ఆగండి అంటుంది.

నెల ఆగితే ఏమవుతుందని బ్యాంకు అధికారి అడుగుతాడు. ఆయనొస్తున్నాడు.. అంటుంది. ఆయన వచ్చారు.. ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత ఎవరైనా బాగుపడ్డారా? జనాన్ని ఏ విధంగా మోసం చేయాలనే దానిపై పీహెచ్‌డీ చేసిన ఈ పెద్దమనిషి మేనిఫెస్టోలో ప్రతి కులానికీ ఒక పేజీ పెట్టి పెద్ద ఎత్తున హామీలిచ్చి మోసం చేశారు. ఇవాళ ఆ మేనిఫెస్టో కనిపిస్తే జనం కొడతారని పార్టీ వెబ్‌సైట్లో కనిపించకుండా చేశారు. కాపులకు రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పాడు. ఆ విషయం అడిగినందుకు పెద్దాయన ముద్రగడ పద్మనాభంను అవమానిస్తూ.. చెయ్యని నేరాలు ఆపాదించి కేసులు పెడతారు. ఆ పెద్దాయన కంచాలు మోగించాలని పిలుపు నిస్తే కంచాలు మోగించిన వారందరిపై కేసులు పెట్టించాడు చంద్రబాబు. మంజునాథ కమిషన్‌ రిపోర్టు ఇవ్వక ముందే.. రిపోర్టు వచ్చేసిందంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి నాపనైపోయిందని తప్పును కేంద్రంపై మోపాడు. బోయలు, మత్స్యకారులనూ ఇదే రీతిన మోసం చేశారు. ఆ విషయం అడిగిన మత్స్యకారుల తాట తీస్తానంటాడు.. న్యాయం చేయండని వచ్చిన నాయీ బ్రాహ్మణులనేమో తోకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. అసలు ఈయన మనిషేనా? ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? 
 
ఈ పెద్దమనిషివి అన్నీ డ్రామాలే 
నాలుగేళ్లూ కళ్లుమూసుకున్న చంద్రబాబు ఆరు నెలల్లో ఎన్నికలుండటంతో కపట నాటకాలు మొదలు పెట్టాడు. అయ్యయ్యో.. మీకు పెన్షన్లు రావట్లేదా? రేషన్‌ కార్డు లేదా? మీకు బియ్యం రావట్లేదా? ఆగండి.. ఇప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్‌ ఇస్తా.. అంటాడు. ఇళ్ల స్థలాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నానంటాడు. ఇళ్ల స్థలాల కోసం రూ.500 కోట్లు ఇస్తానంటారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నా క్యాంటీన్లు, రెండు రూపాయలకే మంచి నీరు, ఆక్వా రైతుల కోసం రూ.2కు కరెంట్‌ యూనిట్‌ ఇస్తానంటాడు. విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఎన్టీఏ నుంచి బయటికొచ్చినా అంటాడు. అయ్యయ్యో.. ప్రత్యేక హోదా రాలేదా.. మోదీతో పోరాడుతా.. అని ఢిల్లీకి పోయి మోదీ ముందు వంగి వంగి సలామ్‌లు చేస్తాడు. అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే చంద్రబాబును మీరు క్షమిస్తే.. రేపు ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు.

మీరు నమ్మరని తన మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. ఆ డబ్బు వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. రేపు మన ప్రభుత్వం రాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి బ్యాంకుల్లో అప్పు ఎంత ఉంటుందో ఆ అప్పంతా నేరుగా నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం. గతంలో రాష్ట్రంలో మహానేత వైఎస్సార్‌ 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆయన బాటలోనే.. ఇల్లులేని ప్రతి పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిస్తున్నా. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బు అవసరమైతే, నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. ఎవరైనా తాగాలంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు వెళ్లి తాగాల్సిన పరిస్థితిని తెస్తాం. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి పూర్తిగా మద్య నిషేధం విధించాకే మళ్లీ ఓట్లు అడిగేందుకు మీ ముందుకు వస్తాను. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 
 
 ఎవడు పడితే వాడొచ్చి కన్సల్టెన్సీల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజి గల్ఫ్‌ దేశాలకు పంపిస్తా ఉంటే అటువంటి వారికి అసలు లైసెన్స్‌ ఉందా? లేదా? వాళ్లు అధికారికంగా ఉన్న వాళ్లేనా? కాదా? ఆ కన్సల్టెన్సీలకు ధృవీకరణ పత్రాలు ఉన్నాయా? లేవా? అని చూడాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో అక్కడికి వెళ్లిన వాళ్ల బతుకులు దుర్భరమవుతున్నాయి.  
 
చంద్రబాబు మాత్రం రూ.2కు 20 లీటర్ల మంచినీళ్లంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా ఇచ్చారా? లేదు. ఇవాళ ప్రజలు నెలకు రూ.600 నుంచి రూ.800 ఖర్చు పెట్టి మంచినీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి– నరసాపురం బ్రిడ్జి కట్టిస్తానని చంద్రబాబు ఎన్నోమార్లు హామీ ఇచ్చారు. ఈ మధ్యనే ఎక్కడో చదివా.. రెండేళ్ల క్రితమే ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలైందని టీడీపీ నాయకులు స్వీట్లు కూడా పంచుకున్నారట.. ఆ నిర్మాణం ఎక్కడైనా కనిపించిందా? 
 
రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంటే, ఈ చంద్రబాబు మాత్రం 2029 నాటికి ఏపీని దేశంలోనే నంబర్‌ వన్‌ చేస్తారట. 2050కి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేస్తానంటాడు. ఇప్పుడాయన వయస్సు 70 ఏళ్లు. 2050 వచ్చే సరికి ఆయనకు వందేళ్లు దాటుతాయి. అప్పటిదాకా చూస్తా ఉండాలట. అప్పటి దాకా ఆయన్ను భరాయించగలమా?  

Advertisement
Advertisement