పింఛన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా?

YS Jaganmohan Reddy fires on chandrababu about pentions and development - Sakshi

ప్రజాసంకల్ప యాత్రలో సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

సీఎం సొంత గడ్డ చంద్రగిరిలో అభివృద్ధి శూన్యం

బాబు చదివిన స్కూల్‌ తుమ్మితే పడిపోయేలా ఉంది  

ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అవినీతి, అన్యాయం, అక్రమాలు, మోసాలకు పరాకాష్టగా మారిపోయిన చంద్రబాబు పాలనకు ముగింపు పలకాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పుట్టి పెరిగిన సొంత గడ్డ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అణువంతైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా ప్రజలను పట్టించుకోని పెద్ద మనిషి మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయనగా ఇప్పుడు పింఛన్లు పెంచుతానని చెప్పడం మోసం కాదా? అని నిలదీశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం లో జరిగినబహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు.

మంత్రిగా ఉండి ఓడిపోయారు: ‘చంద్రగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలోనే పుట్టారు. 1978లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవ వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి అయ్యారు. ఐదేళ్లు పదవిలో కొనసాగారు. మళ్లీ 1983లో ఎన్నికలు జరిగితే 17,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉన్న ఈ పెద్దమనిషి(చంద్రబాబు) దారుణంగా ఓడిపోయారు. ఆయన పరిపాలనా దక్షత ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గం, పుట్టిన గడ్డపై ఎవరికైనా సహజంగానే ప్రేమ ఉంటుంది. ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గ్రామాలకు ఏదైనా మేలు చేయాలని తపిస్తుంటారు. చంద్రబాబు వ్యవహారం మాత్రం ఇంకోలా ఉంది. ఆయన చదివిన పాఠశాల పేరు శేషాపురం స్కూల్‌. బాబు సొంతూరు నారావారిపల్లె పక్కనే ఈ స్కూల్‌ ఉంది. ఇప్పుడు కూడా ఆ బడిలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. గట్టిగా తుమ్మితే పడిపోయే పరిస్థితుల్లో ఇప్పుడా స్కూల్‌ ఉంది. బాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగేళ్లు గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన చిన్నప్పు డు చదువుకున్న బడి పరిస్థితే అలా ఉంటే, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు’ అని జగన్‌ అన్నారు.  

బాబు మోసాలు ఎన్నెన్నో...  
- కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి, అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తాను అని చంద్రబాబు ఎన్నికల ముందు అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచేశారు. వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు.
- ప్రతి పేదకూ 3 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టించలేదు.
- నాలుగేళ్ల కిందట రేషన్‌ షాపుల్లో రకరకాల సరుకులు వచ్చేవి. ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ రావడం లేదు. ఒక్కొక్కటిగా ఊడగొట్టారు.  
- రూ.87,612 కోట్ల పంట రుణాలను పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానన్నారు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి తెప్పిస్తానన్నారు. కానీ, ఇప్పుడు బంగారం ఇంటికి రాకపోగా బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయి. రుణమాఫీ కింద చంద్రబాబు ఇచ్చిన సొమ్ము కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు.  
- జాబు రావాలంటే బాబు రావాలన్నారు. అది రాకపోతే ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మర్చిపోయారు. నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికీ 45 నెలల కాలానికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డారు. ఆయన ఎక్కడైనా కనిపిస్తే గట్టిగా నిలదీసి అడగండి. రూ.90 వేలు ఎప్పుడిస్తావు బాబూ అని ప్రశ్నించండి.  పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, మోసం చేశారు.  
- ఇంటి పన్నులను ఇష్టానుసారంగా బాదేస్తున్నారు. పేదలను నరకయాతనకు గురిచేస్తున్నారు.  
- కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలను ఇప్పటికే మూడుసార్లు పెంచేశారు.  

మన ప్రభుత్వం వస్తే...  
- 4 కత్తెర్లు, 4 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే బీసీలపై, పేదలపై ప్రేమ ఉన్నట్లు కాదు. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల బతుకులను మార్చే కార్యక్రమాలను అమలు చేస్తుంది.  
- మన పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి పెద్ద చదువులు చదువుకోవాలంటే ఇల్లో, పొలమో అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకూడదు. పిల్లల చదువులకు ఎంత ఖర్చయినా సరే మన ప్రభుత్వమే భరిస్తుంది. ఎంత వరకు చదువుకుంటే అంత వరకూ చదివిస్తాం. ఈ విషయంలో నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే ఆయన కుమారుడిగా నేను రెండడుగులు ముందుకేస్తా. పేదలకు నేను ఇస్తున్న భరోసా ఇది.  
-  ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కోర్సు ఫీజు ఏడాదికి రూ.లక్ష. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30 వేలో, రూ.35 వేలో ముష్టి వేసినట్లు వేస్తోంది. మిగతా డబ్బును పేదలు ఎక్కడి నుంచి తేవాలి? అందుకే పెద్ద చదువులకు ఎన్ని లక్షలు ఖర్చయినా నేను భరిస్తా.  
- హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
- చిన్న పిల్లల చదువులే భవిష్యత్తుకు పునాదులు. వాళ్లు పెద్ద చదువులు చదివితే పేదల బతుకులు మారుతాయి.
- పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఏ బడికి పంపినా ఫర్వాలేదు.
- అవ్వా తాతలకు పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబుకు చేతులు రావడం లేదు. అదే కాంట్రాక్టర్లకు అయితే రేట్లు పెంచడానికి సిద్ధపడతారు. ఎందుకో తెలుసు కదా. కాంట్రాక్టర్లయితే కమీషన్లు ఇస్తారు. పేదలు ఇవ్వలేరు కదా! మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్‌ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. నెలకు రూ.2 వేల చొప్పున పెన్షన్‌ అందజేస్తాం.  
- రెక్కాడితే గానీ డొక్కాడని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top