మరో ముందడుగు | Sakshi
Sakshi News home page

మరో ముందడుగు

Published Tue, Feb 13 2018 8:22 PM

YS Jagan Mohan Reddy Another Forward Step - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో ముందడుగు వేసింది. ఏపీకి సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెబుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్టుగానే కార్యాచరణ ప్రకటించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇందుకోసం ఏప్రిల్‌ 5 వరకు డెడ్‌లైన్‌ పెట్టారు. అప్పటిలోగా కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని సంచలన ప్రకటన చేశారు.

మడమతిప్పని పోరు..
ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా రాజీలేని పోరాటాలు సాగిస్తోంది. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు చేసింది. గుంటూరు వేదికగా జగన్‌ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. యువభేరీలు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదా లాభాలను ప్రజలకు వివరించారు.

హోదా సంజీవనే..
ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని, హోదా సంజీవని అని గట్టిగా చెప్పారు. హోదా వస్తేనే రూ. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుందని, ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీ సమస్యలకు పరిష్కారం చూపుతుందని లెక్కలతో సహా వివరించారు. హోదా విషయంలో రాజీపడే సమస్యే లేదని, ఎంతవరకైనా పోరాడతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరినీ  ఒక్క తాటిపైకి తీసుకొచ్చి, హోదా సాధిస్తామని వైఎస్‌ జగన్‌ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు.

చిట్టచివరి అస్త్రం..
తాజాగా ప్రత్యేక హోదా మా హక్కు, ప్యాకేజీ వద్దు నినాదంతో పోరాటానికి పిలుపునిచ్చారు. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 5 వరకు వివిధ దశల్లో పోరాటానికి కార్యాచరణ ప్రకటించారు. చిట్టచివరి అస్త్రంగా తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్‌ వైఎస్ జగన్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement