జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర | Sakshi
Sakshi News home page

జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర

Published Wed, Apr 25 2018 11:29 AM

TRS Jaithrayara From Jagtial - Sakshi

జగిత్యాలరూరల్‌: జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జగిత్యాల మండలం మోతెలో మంగళవారం తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో తెలంగాణ జెండా ఎగురవేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పడిన నాలుగేళ్లలో ప్రతి మారుమూల గ్రామం, పట్టణాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి మంత్రిగా ఉండి ఏనాడూ పట్టణాభివృద్ధికి రూ.5కోట్ల కంటే ఎక్కువ నిధులు తీసుకురాలేదని, తాము మాత్రం రూ.50కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఎంపీ కవిత సహకారంతో జగిత్యాలకు నాలుగు వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ ఇంత భారీసంఖ్యలో ఇళ్లు మంజూరుచేయలేదని, ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసమే మంజూరు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ గొడిశెల రాజేశంగౌడ్, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్, సర్పంచ్‌ అయిలవేని రమాదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement