ఏసీలతో మంగళగిరి ఓటర్లకు వల! | Sakshi
Sakshi News home page

ఏసీలతో మంగళగిరి ఓటర్లకు వల!

Published Sun, Apr 7 2019 3:36 AM

Tdp distributing air cooler missions in nara lokesh constituency - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: రెండు లారీల్లో తరలిస్తున్న ఏసీలు, వాషింగ్‌ మిషన్లను విజయవాడ నగర పోలీసులు శుక్రవారం అర్థరాత్రి పట్టుకున్నారు. డీలర్లు ఎలాంటి ఆర్డర్‌ ఇవ్వకుండా గోదాములో ఉన్న వాటిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  అధునాతన ఎయిర్‌ కండీషనర్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు నియోజకవర్గంలో ఓటర్లకు స్లిప్పులు ఇస్తూ విజయవాడలో డెలివరీ తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పెద్ద సంఖ్యలో ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు పట్టుబడిన నేపథ్యంలో వీటిని కూడా మంగళగిరి ఓటర్ల కోసమే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా.. 
విజయవాడ బందరు రోడ్డు సిరీస్‌ ఫ్యాక్టరీ సమీపంలోని రాజ్యలక్ష్మి మోడరన్‌ రైస్‌మిల్‌లో ఉన్న గోదాము నుంచి రెండు లారీలు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బయలుదేరాయి. బెంజిసర్కిల్‌ వైపు వస్తున్న ఈ రెండు లారీలను ఆటోనగర్‌ బస్టాపు ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు వద్ద ఉన్న పటమట స్టేషన్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. లారీల్లో ఒనీడా కంపెనీకి చెందిన ఏసీలు, వాషింగ్‌ మిషన్లు ఉన్నట్లు గుర్తించారు. బిల్లుల్లో గుంటూరు డీలర్‌ పేరిట 50 ఏసీలు, ఒంగోలు డీలర్‌ పేరిట 15 ఏసీలు, 50 వాషింగ్‌ మిషన్లు ఉన్నాయి.  దీంతో అనుమానించిన పోలీసులు ఒంగోలు సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ డీలర్‌కు ఫోన్‌ చేయగా తాను ఎలాంటి ఆర్డర్‌ ఇవ్వలేదని స్పష్టం చేయడం గమనార్హం. సరైన ఆధారాలు లేకపోవడంతో రెండు లారీలను పటమట పోలీసులు సీజ్‌ చేశారు.  లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రలోభాలకు గురి చేసేందుకే టీడీపీ నేతలు ఏసీలు, వాషింగ్‌ మిషన్లను  తరలిస్తున్నట్లు తెలిసింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement