రూ.30 కోట్ల బేరం | Sakshi
Sakshi News home page

రూ.30 కోట్ల బేరం

Published Sun, Nov 5 2017 3:29 AM

Rs 30 crore bargain for mla rajeshwari vantala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మళ్లీ ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని శనివారం టీడీపీలో చేర్చుకున్నారు. ఈ వ్యవహారంలో రూ.30 కోట్ల బేరం కుదిరినట్లు సమాచారం. వంతల రాజేశ్వరి పార్టీ మారబోతున్నట్లు కొంతకాలం నుంచి వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని టీడీపీ నేతలు ఆశ చూపుతున్నారని, అయితే తాను వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని ఆమె కొంతకాలం క్రితం మీడియా ఎదుట స్వయంగా ప్రకటించడం గమనార్హం.   

ఒత్తిళ్లు.. భారీ ముడుపులు  
మొన్నటి వరకూ వైఎస్సార్‌సీపీలో కీలక స్థానంలో ఉంటూ ఫిరాయించిన ఎమ్మెల్యే ఒకరు రాజేశ్వరితో సంప్రదింపులు జరిపి బేరం కుదిర్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రలోభాలకు సంబంధించిన ఒత్తిళ్లు అధికం కావడం, భారీ మొత్తంలో ముడుపులు అందడం వల్లే ఆమె పార్టీ ఫిరాయించారని తెలుస్తోంది. రూ.20 కోట్లు ఇచ్చినా వైఎస్సార్‌సీపీని వీడి వెళ్లబోనని గతంలో చెప్పిన రాజేశ్వరి తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని తాజాగా పేర్కొన్నారు. గతంలో ఫిరాయింపుదార్లు ఆలాపించిన పల్లవినే అందుకున్నారు. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి ఒంటెత్తు పోకడలతో కొంతకాలంగా కార్యకర్తలకు దూరమయ్యారు. అందుకే రాజేశ్వరి శనివారం టీడీపీలో చేరినపుడు ఆమెతోపాటు పెద్దగా సొంత నియోజకవర్గ నేతలెవ్వరూ వెళ్లలేదు. ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లినా తాము మాత్రం జగన్‌తోనే ఉంటామని రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.   

అభివృద్ధికి నిధులిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజేశ్వరిని శనివారం ఉదయం హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి తీసుకెళ్లారు. వెనువెంటనే చంద్రబాబు ఆమెకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. సీఎంను కలసి బయటికొచ్చిన అనంతరం రాజేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, చంద్రబాబు అభివృద్ధికి నిధులిస్తానని హామీ ఇవ్వడం వల్లే టీడీపీలో చేరానని చెప్పారు. 

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
వైఎస్సార్‌సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం  
పాడేరు: చంద్రబాబు రాజకీయ జీవితమంతా దిగజారుడు, వెన్నుపోట్లతోనే గడిచిపోతోందని వైఎస్సార్‌సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టి నిసిగ్గుగా టీడీపీలో చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆమె శనివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యల్ని తెలుసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’కు పూనుకోవడంతో అధికారపార్టీలో వణుకు పుడుతోందన్నారు. యాత్ర ప్రారంభానికి ముందే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండటంతో ఓర్వలేక జనం దృష్టి మళ్లించేందుకు మళ్లీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారని దుయ్యబట్టారు.

సబ్‌ప్లాన్‌ నిధులు, అభివృద్ధికోసం టీడీపీలో చేరుతున్నట్లు రాజేశ్వరి చెబుతున్నారని, ఆ నిధులు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా అని గుర్తుచేశారు. విలీన మండలాల సమస్యల్ని గాలికొదిలేసి స్వలాభం కోసమే రాజేశ్వరి పార్టీ ఫిరాయించారన్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వంతల రాజేశ్వరి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీకి సిద్ధపడాలన్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి పట్టుందన్నారు. సమావేశంలో అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement