గుజరాత్‌ బాగుంటే దేశం బాగుంటుంది | Sakshi
Sakshi News home page

ఆహా! ఈ ఫలితాలతో డబుల్‌ హ్యాపీనెస్‌ : మోదీ

Published Mon, Dec 18 2017 7:39 PM

this results gave me double happiness, says Modi on Guj, HP result - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఒక రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాల్లో వరుసగా విజయాలు సాధించడం అతిగొప్ప విషయమని, అది ప్రజల ఆకాంక్షలకు అభివ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించిన దరిమిలా.. మరోసారి యావత్‌ దేశానికి అభివృద్ధి సందేశం వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పాలనలో దేశప్రజలు.. ప్రత్యేకించి మధ్యతరగతిలో నూతన ఆశలు, లక్ష్యాలు వ్యక్తం అవుతున్నాయని, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము కృషిచేస్తున్నామన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

‘‘ఈ ఫలితాలు.. వ్యక్తిగతంగా నన్ను సంతోషపెట్టడమేకాదు.. మోదీ లేకపోయినా గుజరాత్‌లో బీజేపీ నిలదొక్కుకుని, విజయం సాధిస్తుందని చాటిచెప్పాయి. ఆవిధంగా  డబుల్‌ హ్యాపీనెన్‌ అన్నమాట! ఇందుకుగానూ గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు మొదలు ప్రతికార్యకర్తనూ అభినందిస్తున్నాను. గుజరాత్‌, హిమాచల్‌ ప్రజలు అభివృద్ధి బాటను ఎంచుకున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. సంస్కరణలకు ఆమోదం తెలపడానికి ఈ దేశం సిద్ధంగా ఉందన్న విషయం నేటి ఫలితాలతో రుజువైంది. నిజానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం గొప్ప విశేషం’’ అని మోదీ అన్నారు.

గుజరాత్‌ బాగుంటే దేశం బాగుంటుంది : దేశాభివృద్ధిలో గుజరాత్‌ అభివృద్ధి ఎంత కీలకమో నేటి ఫలితాలతో మరోసారి రూఢీ అయిందని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌ బాగుంటే దేశం బాగుంటుందని, దేశం బాగుంటే అన్ని రాష్ట్రాలూ బాగుపడతాయని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో గెలుపు కోసం వైరిపక్షాలు ఎన్నెన్నో కుట్రలు పన్నినా, ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టారన్నారు. ‘‘గడిచిన కొద్దిరోజులుగా గుజరాత్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. వారు(విపక్షాలు) కుల వైషమ్యాలను రెచ్చగొట్టారు. కనీసం ఒక్కసారైనా గెలుద్దామని ఏవేవో చేశారు. కానీ మేం అభివృద్ధి బాటలోనే ఉంటామని ప్రజలు మరోసారి జవాబిచ్చారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఏ ఒక్క గుజరాతీని కూడా మనం వేరుగా చూడొద్దు. అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

హిమాచల్‌ పాఠమిదే : ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించినా, తప్పుడు పనులు చేసినా ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని మోదీ అన్నారు. ఇక్కడి ప్రజలు పాజిటివ్‌ ఓటు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ముకానివ్వబోమని తెలిపారు.

Advertisement
Advertisement