ప్రతి గ్రామంలో ఓ సచివాలయం | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామంలో ఓ సచివాలయం

Published Mon, Dec 18 2017 6:32 AM

People support ys jagan in praja sankalpa yatra - Sakshi

శెట్టూరు: ‘ఇది మానవత్వం లేని ప్రభుత్వం. అవ్వ.. తాత.. వయసు పైబడిన వారందరూ ఉన్నారు. ఇలాంటి వారికి కూడా పింఛన్లు ఇవ్వకపోతే ఇది ఏం ప్రభుత్వం. ధైర్యంగా ఉండండి.. వై?ఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో ఓ సచివాలయం ఏర్పాటు చేస్తాం. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తా’నని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. బత్తలపల్లికి చెందిన సుమారు 150 మంది వృద్ధుల పింఛన్లు తొలగించగా.. వారంతా తమ గోడును ప్రతిపక్ష నేతకు వెళ్లబోసుకునేందుకు ఆదివారం ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న తుమ్మల గ్రామ సమీపానికి తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ వారిని పేరు పేరునా ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుళ్లాయప్ప, మాబుసాబ్, బాగురప్ప, పెద్దన్న, వెంకటేశ్, గంగమ్మ, నాగమ్మ, నారమ్మ, నారాయణమ్మ, ఓబుళమ్మ తదితరులు తమ కష్టాలు జగన్‌కు చెప్పుకున్నారు. 2014 వరకు తమకు పింఛన్‌ వచ్చేదని, టీడీపీ అధికారంలోకి రాగానే తమ పింఛన్లన్నీ తొలగించారని వాపోయారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామానికి చెందిన పది మందిని నియమించి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, పింఛన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలన్నింటికీ సంబంధించిన అర్హత పత్రాలను అక్కడికక్కడే 72 గంటల్లోగా మంజూరు చేయిస్తామన్నారు. అవ్వ, తాతలకు రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేలు  పింఛను ఇస్తామని చెప్పారు.  

Advertisement
Advertisement