ప్రబోధానంద వీడియోలు ప్రదర్శించిన జేసీ!

JC Diwakar Reddy Fires on Prabhodananda Swamy - Sakshi

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం కేంద్రంగా ఉన్న ప్రబోధానంద స్వామిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభోదానంద దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆయన బుధవారం అమరావతిలో మీడియాకు ప్రదర్శించారు. ప్రబోధానంద వల్ల మోసపోయామంటున్న బాధితుల కథనాలను కూడా ప్రదర్శించారు. దేవుళ్లను బూతులు తిట్టేవాడు స్వామా.. ఆయనకు ఏం పోయేకాలం వచ్చిందోనని జేసీ విరుచుకుపడ్డారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభోదానంద భక్తులకు, జేసీ వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగి.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి జేసీ వివరిస్తూ.. ‘‘చినపొడమడ గ్రామంలో పేదలు, అన్ని కులాల వారూ, అన్ని పార్టీల వారూ ఉన్నారు. గతంలో ఎన్నడూ జరగని ఘటన చినపొడమడలో జరిగింది.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు ఆశ్రమం దగ్గరకు రాగానే స్వామి భక్తులు రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. చినపొలమడే కాదు.. పెదపొలమడలోనూ స్వామిజీ అనుచరులు దాడులకు దిగారు. ఎన్నడూ చూడని ఆయుధాలతో దాడులు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇంత అరాచకం సృష్టించిన స్వామీ మీద పోలీసులు చర్యలు తీసుకోరా?’ అని జేసీ అన్నారు. పోలీసులపై మళ్లీ చిందులు దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోకపోగాపెళ్లి కొడుకులు మాదిరి అధికారులు వచ్చారని జేసీ విమర్శించారు. స్వామీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు పరుగులు పెట్టారని విమర్శించారు. ‘కానీ నేను టెంటులో నుంచి కదల్లేదు. నా టెంటులోకి వచ్చి దాడులు చేశారు. నా పక్కన కూర్చొన్న వారిపై దాడి చేశారు.  నా గన్ మ్యాన్ ఉన్నా.. అతనూ పరుగులు తీశాడు. నా పక్కన కూర్చొన్న వారికి దెబ్బలు తగిలితే కనీసం గాల్లో కాల్పులు జరపలేదు. పోలీసుల అసోసియేషన్ ఉంది కాబట్టి నోరు మూసుకుని ఉండాలా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదా ? గతంలో ఎర్ర టోపీలు పెట్టుకుని ఊళ్లలోకి వస్తే.. తప్పు చేసిన వాళ్లు అడ్డ పంచెలు ఎగ్గొట్టి పరుగెత్తేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా గాల్లో కాల్పులు జరపడానికి వీల్లేదా?’ అని జేసీ పేర్కొన్నారు.

ప్రభోదానంద డేరా బాబాను మించిపోయాడు!
‘డేరా బాబా చేశాడో లేదో తెలీదు కానీ.. తాడిపత్రి స్వామిజీ మాత్రం తన ఆశ్రమంలో ఏవేవో చేస్తున్నారు. ప్రబోధానంద డేరా బాబాను మించిపోయారు. స్థానిక మహిళలతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం రిపోర్టులు తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని  చెప్పారు. ఇన్నేళ్లు ఉండి.. ఇన్ని అరాచకాలు జరుగుతోంటే ఏం చేస్తున్నారని సీఎం అడిగారు. దొంగ రేషన్ కార్డులు.. దొంగ ఆధార్ కార్డులు ఆశ్రమంలో ప్రింట్ చేస్తున్నారు. ప్రబోధానంద ఆశ్రమంలోని కట్టడాలు అక్రమం. ఆశ్రమంలో ఎటువంటి కట్టడాలు చేపట్టవద్దంటూ కోర్టు ఆదేశించింది. ప్రబోధానంద ఇప్పటికే మూడు హత్యలు చేశారు. కోర్టుకు వెళ్లారు’ అని జేసీ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top