నకలు మేనిఫెస్టోతో బీజేపీ గెలిచింది: హరీశ్‌ | Sakshi
Sakshi News home page

నకలు మేనిఫెస్టోతో బీజేపీ గెలిచింది: హరీశ్‌

Published Wed, May 16 2018 2:41 AM

Harish rao commented over bjp - Sakshi

సాక్షి, మెదక్‌: టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను నకలు కొట్టి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్, వెల్దుర్తి, నిజాంపేట, చిన్నశంకరంపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలసి రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో హరీశ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పేర్లు బీజేపీ మార్పు చేసి కర్ణాటక మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు.

రైతుబంధు పథకంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు చాటుమాటుగా రైతుబంధు చెక్కులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు ప్రజల గోస పట్టదని, సీఎం కుర్చీ కోసమే బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. ప్రజలు పచ్చగా ఉంటే కాంగ్రెస్‌ నాయకులకు నచ్చదని, వారు పచ్చగా ఉంటే చాలని భావిస్తారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణ కోసం మల్లన్న సాగర్, దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు చెల్లించి కందులు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ జూన్‌ 2 నుంచి ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్రమంతా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ముందుగా ఈ పరీక్షలు కాంగ్రెస్‌ నాయకులు చేయించుకోవాలని, వారికి రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు చంద్రాగౌడ్, జేసీ నగేశ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement