139వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

139వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Apr 19 2018 2:30 AM

139th day padayatra diary - Sakshi

18–04–2018, బుధవారం
శోభనాపురం క్రాస్, కృష్ణా జిల్లా

ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలను?!
‘మూడు రోజులుగా ఎప్పుడొస్తావా.. అని ఎదురుచూస్తున్నాం. ఈ ఎండలో నీకు ఎంత కష్టమొచ్చిందయ్యా.. మీ నాయనా ఇట్లాగే నడిచాడు. నీకు అంతా మంచే జరుగుతుంది’అంటూ వెల్వడంకు చెందిన శత సంవత్సరాలకు చేరువులో ఉన్న వృద్ధ దంపతులు గూడూరు భాగ్యమ్మ, నాగభూషణం తాత ఆకాంక్షించారు. నన్ను కలిసిన ఆనందంతో వారు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.. కాలికి గాయమైనా, కనుచూపు సరిగా లేకున్నా.. ఇద్దరు యువకుల సాయంతో నన్ను కలిసి ఓ మనవడిగా నిండు మనసుతో దీవించారు.  

‘ఆశీర్వదించు అన్నయ్యా.. రేపే నా పెళ్లి. మీరు తప్పక రావాలి’అంటూ చెల్లి ప్రేమను చూపింది గణపవరంలో పెళ్లికూతురైన లక్ష్మీప్రసన్న.‘అన్నా.. మాలాంటి పేదలకు జబ్బుచేస్తే మొదటగా తలుచుకునేది మీ నాన్నగారినే. గతంలో నాకు నరాల వ్యాధి ఉండేది. అప్పుడు నా కష్టం చెప్పుకోడానికి పాదయాత్ర చేస్తున్న షర్మిలక్కను కలిశాను. ఇప్పుడేమో నా బిడ్డకు గుండె జబ్బంటున్నారు. మిమ్మల్ని కలిస్తే మంచి జరుగుతుందని వచ్చానన్నా..’అంటూ మూడు నెలల బిడ్డను చంకనేసుకుని అన్నపై ఉన్న నమ్మకాన్ని చాటింది.. పాతనాగులూరుకు చెందిన నందిని అనే చెల్లెమ్మ.  

‘ఉదయం ఏమన్నా తిన్నావో లేదో.. ఈ పళ్లన్నా తినయ్యా..’అంటూ ఇంటి పెరట్లో పండిన ద్రాక్ష పళ్లను తెచ్చి తల్లి ప్రేమను పంచింది వెల్వడంకు చెందిన ఓ పెద్దమ్మ. ‘అయ్యా.. చంటి బిడ్డనేసుకుని మీ నాన్న పాదయాత్రలో నడిచా. మీ చెల్లి పాదయాత్రనూ చూశా. ఇప్పుడు నీ పాదయాత్రలో పాల్గొందామని వచ్చా. మీ నాన్న పాలనలో రైతులెప్పుడూ ఇబ్బందిపడలేదు. అలాంటి పాలన నీతోనే వస్తుందయ్యా..’అంటూ నిండు మనసుతో తమ్ముడి మీదున్న విశ్వాసాన్ని చాటింది తెలంగాణలోని చెన్నూరుకు చెందిన వెంకటేశ్వరమ్మ అనే అక్క. ఈ ఆప్యాయతలు, అనురాగాలకు మనసు పులకరించింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా ఇంత ప్రేమను పొందడం.. ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలను?! 

‘సార్‌.. 104 వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత వరకూ బాగా నడిచేది. చంద్రబాబు పాలన వచ్చాక 104ను ప్రయివేటు సంస్థ చేతిలో పెట్టాడు. ఈ ప్రయివేటు వారికి వ్యాపార దృష్టి, లాభాపేక్ష తప్ప సేవాభావం ఇసుమంతైనా లేదు. అంబులెన్స్‌ల నిర్వహణను అసలు పట్టించుకోవడమే లేదు. చాలా వరకూ ములనపడ్డాయి. మిగిలినవేవీ కండిషన్‌లో లేవు. వాటితో పనిచేయాలంటే దినదిన గండమే. ఈ పాలనలో మా జీతాల మాట దేవుడెరుగు.. జీవితాలకే భద్రత లేదు’.. అంటూ వాపోయారు నన్ను కలిసిన 104 సిబ్బంది. ‘అన్నా.. గత శనివారం బ్రేకులు సరిగా పనిచేయని వాహనంలో వెళుతూ ప్రమాదానికి గురై.. మా ఇద్దరు సహచరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు నిండు గర్భిణీ..’అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు సర్కారుదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారట 104 ఉద్యోగులు. ఏ పనిలోనైనా స్వలాభమో.. రాజకీయ ప్రయోజనమో.. కక్ష సాధింపు చర్యలో తప్ప ప్రజల సంక్షేమం గురించి కాస్తంతైనా ఆలోచించని ఈ ప్రభుత్వానికి ఎన్ని వినతులిచ్చినా, ఎన్ని ఆందోళనలు చేసినా.. దున్నపోతు మీద వాన పడ్డట్టే.  

ఐదు కోట్ల ఆంధ్రుల అభీష్టం మేరకు ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా త్యజించి, ఆమరణ దీక్షలు చేసి, రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచి.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన నా సహచరులను మనస్ఫూర్తిగా అభినందించాను.
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.. 104, 108 సేవలను బలోపేతం చేస్తాం.. అంటూ గొప్పగా మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బలోపేతం మాట దేవుడెరుగు..108, 104 పథకాల ఉనికినే ప్రశ్నార్థకం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి.. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేయడం న్యాయమేనా? ఆ పథకాల పేరెత్తగానే నాన్నగారు గుర్తుకు రావడమే దానికి కారణమా? మీ అసూయకు, సంకుచితత్వానికి ప్రజల్ని బలిచేయడం ధర్మమేనా? 
- వైఎస్‌ జగన్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement