109వ రోజు పాదయాత్ర డైరీ

109th day padayatra diary - Sakshi

11–03–2018, ఆదివారం
ఈపూరు పాలెం, ప్రకాశం జిల్లా

పాలనలో వైఫల్యాలకు ప్రకాశమే నిదర్శనం 
ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు నేటితో చివరి రోజు. ఈ జిల్లాలో మరిచిపోలేని అనుభవాలు ఎన్నెన్నో. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా దార్శనికతతో పాలించిన నాన్నగారి స్వర్ణయుగ పరిపాలన ఫలాలను అందుకున్న ప్రజల కృతజ్ఞతాపూర్వక ప్రేమాభిమానాలను చవిచూశాను. మరోవైపు ప్రజాకంటక పాలకుని నిరాదరణ, వంచనకు గురై కష్టాల కడలిని ఈదుతున్న ప్రజల కడగండ్లనూ కళ్లారా గమనించాను. ప్రజల కన్నీరు తుడవటానికి మహానేత చేసిన భగీరథ యత్నాలనూ చూశాను. మిగిలిపోయిన కొద్దిపాటి పనులను కూడా పూర్తి చేయని నేటి స్వార్థ రాజకీయ నేత నిర్లక్ష్యాపూరిత, వివక్షాభరిత పాలన ఫలితాలనూ వీక్షించాను. 

ఈ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు నిర్లక్ష్యానికి గురైన రాళ్లపాడు ప్రాజెక్టును చూడగానే మనసు చివుక్కుమంది. గిట్టుబాటు ధరల్లేక నష్టాల్లో కూరుకుపోయి ‘బ్యారెన్‌ లైసెన్సులు కూడా వెనక్కి ఇచ్చేస్తాం.. మాకీ వ్యవసాయమే వద్దు’ అంటూ వలసలకు సిద్ధమైన పొగాకు రైతుల కష్టాలు విని కలత చెందాను. ‘కందుకూరు మున్సిపాల్టీ ప్రజల దాహార్తిని సాగర్‌ జలాలతో తీర్చిన ఘనత నాన్నగారిదే’ అంటూ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటే గర్వంగా అనిపించింది. కొండెపి నియోజకవర్గంలో పాడి రైతుల కష్టాలను విన్నాను. వ్యవసాయం భారమై ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకుంటే... ఒంగోలు సహకార డెయిరీని మూసేయించడానికి నేటి పాలకులు పన్నిన కుట్రతో తమకు జీవనోపాధే లేకుండా పోయిందన్న రైతన్నల ఆవేదన మనసును కష్టపెట్టింది. కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ నీరు తాగుతున్న ప్రజల కష్టాలు గుండెను బరువెక్కించాయి. ఆ కష్టాలకు పరాకాష్టగా కిడ్నీలు చెడిపోయినవారి దీనగాథలు మనసును కలత చెందించాయి. అదే నియోజకవర్గంలో సుబాబుల్, జామాయిల్, కంది, శనగ రైతుల వెతలను కళ్లారాగాంచాను. 

మార్కాపురం నియోజకవర్గంలో గ్రామగ్రామాన గుక్కెడు నీళ్ల కోసం మైళ్లకొద్దీ నడిచి వెళ్తున్న అక్కచెల్లెమ్మలను చూస్తుంటే బాధనిపించింది. ‘ట్యాంకర్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నాం అన్నా..’ అని వారు చెబుతుంటే... కనీస అవసరాలను కూడా తీర్చలేని అసమర్థ రాజకీయాలపై అసహ్యం వేసింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ వెతలు తీరేవి కదా అనిపించింది. సంతనూతలపాడు దాహార్తిని తీరుస్తున్న రామతీర్థం ప్రాజెక్టు నాన్నగారి చలువే అని చెబుతుంటే మనసు సంతోషంతో నిండిపోయింది. అదే సమయంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో మిగిలిపోయిన అరకొర పనులను కూడా నేటి పాలకులు పూర్తి చేయకపోవడం ఎంత దౌర్భాగ్యం అనిపించింది.

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న గ్రానైట్‌ పాలిషింగ్‌ పరిశ్రమల దీనస్థితి మనసుకు బాధ కలిగించింది. దర్శి నియోజకవర్గంలో పరిశ్రమలను తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు హామీ బూటకమని ప్రజలు ఈసడిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని భవనాసి, యర్రం చినపోలిరెడ్డి పథకాలు బాబుగారి నిర్లక్ష్యానికి సాక్షీభూతాలుగా నిలిచాయి. అక్కడ మిర్చి, శనగ రైతుల అగచాట్లు చెప్పడానికి మాటలు సరిపోవు. పర్చూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల భూదాహం బకాసురుడిని తలపించింది. పేద, దళితుల భూములు కూడా ఆక్రమణలకు గురవుతుంటే ఈ భూ రాబందుల అరాచకాల నుంచి విముక్తి ఎప్పుడా అనిపించింది. చీరాలలో చితికిపోయిన నేతన్నల హృదయ ఘోష విని మనసు వ్యథాభరితమైంది. ఆ పడుగు పేకల బరువు బతుకుల వ్యథల్ని తొలగించాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎన్ని కష్టాలున్నా నాన్నగారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నాపై కూడా చూపిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు నా బాధ్యతల్ని మరింత పెంచాయి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రకాశం జిల్లాలో నాన్నగారు చేపట్టిన ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. మీ 13 ఏళ్ల పాలనకు గుర్తుగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కానీ, పథకం కానీ చెప్పగలరా? 
-వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top