20 ఏళ్ల కిందే అమెరికా వెళ్లిన మోదీ

20 ఏళ్ల కిందే అమెరికా వెళ్లిన మోదీ - Sakshi


అదీ ఆ దేశ ఆహ్వానంపైనే

సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వ ఆహ్వానంతో నరేంద్రమోదీ ఆ దేశంలో కాలుమోపారు.. అక్కడి ఏడు రాష్ట్రాల్లో కలియదిరిగారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతబలంగా ఉండటానికి కారణాలను స్వయంగా విశ్లేషించుకున్నారు. అక్కడి స్పేస్ సెంటర్‌ను పరిశీలించి ఆ స్థాయి కి భారతదేశం ఎదగాలంటే ఎంత కాలం పడుతుందోనని మథనపడ్డారు. అగ్రరాజ్యాధిపతి ప్రయాణించే వి మానాన్ని నిశితంగా పరిశీలించారు.. యువకులతో మా ట్లాడారు. విద్యావిధానం, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజులు అక్కడే గడిపారు.అయితే ఇది నేటి సంగతి కాదు... సరిగ్గా 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. గోద్రా పరిణామాల నేపథ్యంలో మోదీకి వీసా ఇవ్వటానికి నిరాకరించిన అగ్రరాజ్యం.. ఇప్పుడు అదే మోదీని ఆహ్వానించి మరీ రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ఇంతలో ఎంత తేడా! మరో విశేషం ఏమిటంటే... వీసా నిరాకరణకు ముందే ఓసారి ఆ ప్రభుత్వం ఆహ్వానం మేరకు మోదీ అమెరికాకు అతిథిగా వెళ్లారు.

 

 1994 జూలై... భారతదేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు ఒక అధ్యయన యాత్ర ప్రారంభించా రు. 41 రోజుల పర్యటన షెడ్యూల్ అది. ఫ్రాన్స్, అమెరికాల్లో సాగింది. అందులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా.. మిగతా ముగ్గురు బీజేపీ నాయకులు. ఆ బీజేపీ నేతల్లో నరేంద్ర మోదీతోపాటు ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉండటం విశేషం. మూడో నేత ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్. వారు తొలు త ఫ్రాన్స్ పర్యటించిన అనంతరం ‘అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ (ఏసీవైపీఎల్)’ అధికారిక ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లారు. అది పూర్తిగా అమెరికా ప్రభుత్వ కార్యక్రమంగా సాగింది. అప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, కిషన్‌రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఢిల్లీలోని పార్టీ నివాసంలో వీరి గదులు కూడా పక్కపక్కనే ఉండేవి.

 

అప్పుడూ ఇదే దృష్టికోణం...

అప్పట్లో అమెరికా పర్యటనను మోదీ ఓ సరదా ట్రిప్పు గా పరిగణించలేదు. అసలు అమెరికా అగ్రరాజ్యంగా ఎదగటానికి కారణాలేమిటి..? భారత్ ఆ స్థానానికి రావాలంటే అనుసరించాల్సిన విధానాలేమిటి..? అన్న కోణంలో పరిశీలించడానికి ఆ పర్యటనను మోడీ విని యోగించుకున్నారు. ‘‘నేను, అనంతకుమార్ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తూ ముందుకు సాగుతుంటే... మోదీ మాత్రం చాలా సీరియస్‌గా, ఏదో ఆలోచిస్తూ పర్యటనను సాగించారు. అక్కడి యువకులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయనేతలను ఏవేవో విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన దేశం ఇలా ఎప్పుడు మారుతుందో? అని మాతో తరచూ అనే వారు..’’అని నాటి పర్యటన విశేషాలను కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.

 

గడ్డం తీసేయాలన్న అద్వానీ..

ఆ పర్యటనకు బయలుదేరేముందు నరేంద్ర మోదీకి, కిషన్‌రెడ్డికి గడ్డం ఉంది. వీరిని పర్యటనకు ఎంపిక చేసిన నాటి పార్టీ జాతీయాధ్యక్షుడు అద్వానీ ఇద్దరినీ పిలిచి గడ్డం తీసేసి నీట్‌గా తయారు కావాలని ఆదేశించారట. దీంతో పర్యటనకు బయలుదేరే రోజు ఇద్దరూ గడ్డం తీసేశారట. ఆ తర్వాత మళ్లీ మోదీ ఎప్పుడూ నీట్‌గా గడ్డం తీసేసుకున్న దాఖలాలు లేవని పార్టీ నేతలు చెబుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top