రేఖకు షారుఖ్ ఖాన్ పెళ్ళి ప్రతిపాదన | Shah Rukh proposes to Rekha, yet again! | Sakshi
Sakshi News home page

రేఖకు షారుఖ్ ఖాన్ పెళ్ళి ప్రతిపాదన

Dec 2 2015 11:24 PM | Updated on Oct 2 2018 3:43 PM

రేఖకు షారుఖ్ ఖాన్ పెళ్ళి ప్రతిపాదన - Sakshi

రేఖకు షారుఖ్ ఖాన్ పెళ్ళి ప్రతిపాదన

తారలుగా మనం అభిమానించే మహా మహా స్టార్లు కూడా ఒకప్పుడు మన లాంటి వాళ్ళే కదా!

తారలుగా మనం అభిమానించే మహా మహా స్టార్లు కూడా ఒకప్పుడు మన లాంటి వాళ్ళే కదా! చిన్నతనంలో వాళ్ళూ ఎవరో ఒకరిని అభిమానించి, తెరపైన కొందరిని చూసి మనసు పారేసుకొనే ఉంటారు. బాలీవుడ్ బాద్‌షాగా పేరున్న షారుఖ్ ఖాన్ కూడా అందుకు అతీతమేమీ కాదు. తాజాగా ఆయన తన చిన్నప్పటి కలలరాణి గురించి మరోసారి బయటపెట్టారు. ‘ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్’ కార్యక్రమంలో షారుఖ్‌కు అవార్డు ఇవ్వడానికి సౌందర్యరాశిగా పేరున్న సీనియర్ నటి రేఖ వేదిక మీదకు వచ్చారు.

షారుఖ్‌కు కలిసొచ్చిన నటి అంటే రేఖే. ఆమె చేతుల మీదుగా అనేకసార్లు అవార్డులు అందుకున్న అనుభవం షారుఖ్‌ది. తాజా ఫంక్షన్‌లో షారుఖ్ కొద్దిగా రొమాంటిక్‌గా మారి, తన అనుభవం ఒకటి షేర్ చేసుకున్నారు. అది ఏమిటంటే, కొన్నేళ్ళ క్రితం ముంబయ్‌లోని మెహబూబ్ స్టూడియోస్‌లో జరిగిన ఒక అవార్డ్ నైట్‌లో రేఖాజీకి షారుఖ్ తన ప్రేమ, పెళ్ళి ప్రతిపాదన చెప్పారట. ఇప్పటికీ, ఆమె నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నారట. ‘‘రేఖాజీ చేతి నుంచి అవార్డు అందుకున్న ప్రతిసారీ ఈసారైనా ఆమె నన్ను పెళ్ళి చేసుకుంటారేమోనని ఆశిస్తూ ఉంటా’’ అని షారుఖ్ ఛలోక్తి విసిరారు.

రేఖ కూడా ఆ మాటను చిలిపిగా తీసుకొని, ‘‘ఈ విషయం నేను గౌరి (షారుఖ్ భార్య)తో మాట్లాడాలి’’ అని జోక్ చేశారు. షారుఖ్ కూడా తక్కువేమీ తినలేదు. వెంటనే, ‘‘అవును. ఎవరు ఏ బెడ్‌రూమ్ తీసుకోవాలో మీరిద్దరూ మాట్లాడుకొని, నిర్ణయించుకోవాల్సిందే’’ అంటూ రొమాంటిక్ రిప్లై ఇచ్చారు. మొత్తానికి, ఇన్నేళ్ళ తరువాత కూడా షారుఖ్ తన చిన్నప్పటి వెండితెర కలల రాణిని మర్చిపోలేదన్న మాట. తారలంటే ఉండే అభిమానం, ప్రేమ ఎవరికైనా ఒకటేననడానికి షారుఖ్ మాటలే తాజా ఉదాహరణ.
 

Advertisement
 
Advertisement
Advertisement