ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌ | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

Published Tue, Aug 13 2019 9:55 PM

Pawan Kalyan Superb Speech At Mana Cinemalu Book Launching - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణీ అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కో  వడం చాలా కష్టమన్నారు. అలాంటి వ్యక్తులపట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీష్ కవి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి... అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు  రాసిన కవులు, రచయితలకు జోహార్లన్నారు.  

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర – పరిణామం’పుస్తకాన్ని  పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావి కొండల రావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..  ‘తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. బాహుబలి వంటి సినిమాలు వచ్చినాగానీ, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదు. అదిగానీ మనం అర్ధం చేసుకోగలిగితే చాలా గొప్ప సినిమాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి.  

జానీ సినిమా ఎందుకు ఆడలేదో  నాకే బాగా తెలుసు. కమర్షియల్ యాంగిల్ లో పడి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయాను. సావిత్రి, ఎస్వీ రంగారావులు  ఎవరో ఈ జనరేషన్‌ వారిలో చాలా మందికి తెలియదు. సావిత్రిగారి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్ధ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయాం. సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.. నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయి. అలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడం నిజంగా ఆనందం కలిగించింది. అలాంటి సినిమాలతోపాటు చాలా విలువలు ఉన్న సినిమాలు ముందు ముందు చాలా రావాలి.  మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు ముందు ముందు ఇంకా రావాలి, తెలుగు సినిమా చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాలి. చరిత్రను ఇలా పుస్తకాల్లో నిక్షిప్తం చేయడానికి ఒక కమిటీ ఉంటే దానిని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాన’ని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement