నాడీ పోరాట కళా శిక్షణలో కాజల్‌

Kajal Aggarwal Training For Bharateeyudu 2 Movie - Sakshi

సినిమా: నాడీ పోరాట కళలో నటి కాజల్‌ శిక్షణ తీసుకుంటున్నది. ఇప్పుడు హీరోయిన్లు హీరోలకు తీసిపోమంటున్నారు. నిజానికి స్త్రీ అబల అన్నది నాటి మాట. అబల కాదు సబల అని అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్న కాలం ఇది. సినిమాల్లోనూ సాహసాలు చేయడానికి హీరోయిన్లు రెడీ అంటున్నారు. అందుకు వారు తగిన శిక్షణ తీసుకుంటున్నారు కూడా. ఇంతకు ముందు నటి అనుష్క రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి సన్నివేశాల్లో శిక్షణ తీసుకుని నటించింది. ఈ మధ్య నటి సమంత కూడా సీమరాజా చిత్రం కోసం కర్రసాములో శిక్షణ తీసుకుని నటించింది. ఇక ఆ మధ్య నటి శ్రుతీహాసన్‌ సంఘమిత్ర చిత్రం కోసం ఆస్ట్రేలియాలో కత్తిసాములో తర్ఫీదు పొందింది. అయితే అనివార్యకారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభం కాలేదు. కాగా ఇప్పుడు అందాలతార కాజల్‌అగర్వాల్‌ సాహసాలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు తాజాగా విశ్వనటుడు కమలహాసన్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది.

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌కు జంటగా ఇండియన్‌–2లో నటించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఈ అనూహ్య గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నానికి ప్రిపేర్‌ అవుతోంది. 22 ఏళ్ల క్రితం కమలహాసన్‌ నటించిన ఇండియన్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రం ఇండియన్‌–2. అందులో కమలహాసన్‌ టైటిల్‌ పాత్ర నాడీ పోరాట కళతో అవనీతి పరులను శిక్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నాడీ పోరాట కళను శంకర్‌ నటి కాజల్‌అగర్వాల్‌తో ప్రదర్శింపనున్నారు. ఇందుకోసం కాజల్‌ నాడీ పోరాట కళలో శిక్షణ తీసుకుంటోందట. ఈ కళ తనకు నిజజీవితంలోనూ ఉపయోగపడుతుందని భావించి సీరియస్‌గానే నాడీ పోరాట కళను నేర్చుకుంటున్నట్లు కాజల్‌ వర్గం పేర్కొన్నారు. పనిలో పనిగా కలరి(మలయాళంలో ప్రాచుర్య విద్య) విద్యలోనూ శిక్షణ పొందుతోందట. మొత్తం మీద ఇండియన్‌–2 చిత్రంలో కాజల్‌ను ఒక పోరాట నారీగా చూడవచ్చునన్న మాట. ఈ చిత్ర ప్రారంభం ఆలస్యం అవుతోంది. నిజానికి ఈ నెల 14నే ఇండియన్‌–2 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు, నిర్మాణ సంస్థ లైకా అధినేతలు వెల్లడించారు. అయితే ఈ భారీ చిత్రం కోసం రూ.2 కోట్ల వ్యయంతో వేస్తున్న బ్రహ్మాడ సెట్‌ పూర్తి కాకపోవడంతో ఇండియన్‌–2 చిత్రం జనవరిలో సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top