జోరు.. హుషారు | It's difficult to match up to Lakshmi Manchu | Sakshi
Sakshi News home page

జోరు.. హుషారు

Nov 16 2018 2:14 AM | Updated on Nov 16 2018 2:14 AM

It's difficult to match up to Lakshmi Manchu - Sakshi

జ్యోతిక, మంచు లక్ష్మీ

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు ఒప్పుకుంటూ జోరు మీద ఉన్నారు జ్యోతిక. ఒక సినిమా (‘కాట్రిన్‌ మొళి’)  ఇవాళ రిలీజ్‌ అంటే.. రెండు రోజుల క్రితమే మరో సినిమాకు ముహూర్తం జరిపారు. ప్రస్తుతం సూర్య చేస్తున్న ‘ఎన్‌జీకే’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ సంస్థే జ్యోతిక కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. నూతన దర్శకుడు యస్‌. రాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఇటీవలే జరిగింది. రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే వారం నుంచి స్టార్ట్‌ కానుందట. ఈ చిత్రం షూటింగ్‌ కోసం సుమారు 50 లక్షల వ్యయంతో ఓ స్కూల్‌ సెట్‌ రూపొందించారట. మరి ఈ సినిమాలో జ్యోతిక స్కూల్‌ టీచర్‌గా కనిపిస్తారా? లేక కీలక సన్నివేశాల కోసం ఆ స్కూల్‌ సెట్‌ ఉంటుందా? వేచి చూడాలి.

లక్ష్మీతో పోటీ పడగలనా అనిపించింది
జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. విద్యా బాలన్‌ హిందీ హిట్‌ చిత్రం ‘తుమ్హారీ సులూ’కి రీమేక్‌ ఇది. ఇందులో లక్ష్మీ మంచు జ్యోతిక బాస్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీతో కలసి నటించడం గురించి జ్యోతిక మాట్లాడుతూ – ‘‘మంచు లక్ష్మీతో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీ పవర్‌ఫుల్‌ లేడీ. తను నటించిన విధానం నాకు ముచ్చటేసింది. తను యాక్ట్‌ చేస్తున్నట్లే అనిపించదు. పాత్రలా ప్రవర్తిస్తుంది అంతే. కాన్ఫిడెంట్‌గా, తెలివిగా ఉండటం చూసి నేను తనతో పోటీపడగలనా? అనిపించింది. మేం ఇద్దరం అమ్మలం. సెట్‌లో మా పిల్లలు బాగా కలిసిపోయారు’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement