
విమానాన్నే దొంగిలించబోయాడు
విమానాన్ని దొంగిలించబోయి పోలీసులకు చిక్కాడో వ్యక్తి.
టెక్సాస్: చిన్నా చితకా కాదు ...ఏకంగా విమానాన్ని దొంగిలించబోయి పోలీసులకు చిక్కాడో ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే..అమెరికాలోని టెక్సాస్లో సెక్యురిటీ గేట్ను బద్దలు కొట్టి విమానాశ్రయంలోకి శుక్రవారం ఓ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడ విమానాలు నిలిపే ప్రదేశం దగ్గరకు వెళ్లాడు. ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు చెందిన లియర్ జెట్ విమానం దగ్గరకు చేరుకున్నాడు. టైర్ల కింద కదలకుండా ఉండడానికి పెట్టే టైర్ చాక్స్ని తీసేసి విమానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
దీన్ని గమనించిన టెక్సాస్ విమానయాన సిబ్బంది అక్కడ ఉన్న పోలీస్ అధికారిని అప్రమత్తం చేశారు. ఆ పోలీసు అధికారి అక్కడకు చేరుకొని సదరు వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయగా అతను సహకరించలేదు. దీంతో అధికారి తన దగ్గర ఉన్న స్టెన్ గన్తో అతనికి షాక్ ఇచ్చాడు. అయినా అతనిలో ఎలాంటి స్పందన లేదు. దీంతో అక్కడున్న వారి సహాయంతో ఎట్టకేలకు అతడిని బంధించారు. అయితే ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. దీంతో అతని ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.