బెంగాల్‌ టైగర్‌కు బంగారు పన్ను | Bengal Tiger Fitted With Golden Fang | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ టైగర్‌కు బంగారు పన్ను

Nov 1 2019 7:22 PM | Updated on Nov 1 2019 7:55 PM

Bengal Tiger Fitted With Golden Fang - Sakshi

న్యూఢిల్లీ : కారాకు ఐదేళ్లు. దాదాపు 57 కిలోల బరువు. కారా అంటే అమ్మాయి కాదు, ఆ మాటకొస్తే మనిషే కాదు. బెంగాల్‌ టైగర్‌ పిల్ల. అది జర్మనీలోని పులుల సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అది దాని కోసం కేటాయించిన బొమ్మలతో ఆడుకుంటూ ఓ కోర పన్నును ఊడ గొట్టుకుంది. డెన్మార్క్‌ చెందిన డెంటిస్టులను సంరక్షణ కేంద్రం అధికారులు పిలిపించారు. వారు అగస్టు నెలలో కారా ఉంటోన్న పశ్చిమ జర్మనీలోని మాస్‌వీలర్‌ పులుల సంరక్షణ కేంద్రానికి వచ్చారు. రెండున్నర గంటలపాటు శస్త్ర చికిత్స చేసి దెబ్బతిన్న కోర పన్నును తొలగించి తీసుకెళ్లారు. మళ్లీ 15 రోజుల క్రితం సంరక్షణ కేంద్రానికి వచ్చారు. వారు పులి కోర పన్ను స్థానంలో బంగారంతో చేసిన పన్నును తీసుకొచ్చారు. దాదాపు గంటసేపు శస్త్ర చికిత్స చేసి దానికి ఈ పన్నును అమర్చారు.

ఇప్పటికీ పులి పూర్తిగా కోలుకుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా సంరక్షణ కేంద్రం అధికారులు దానికి బోన్‌లెస్‌ మటనే పెడుతున్నారు. 2013లో ఇటలీలో ఓ ప్రైవేటు వ్యక్తి నిర్బంధంలో ఉన్న ఈ పులిని విడిపించి జర్మనీ తీసుకొచ్చారు. బంగారు పన్ను పెట్టడానికి కారణం, అది సమర్థంగా బిగుసుకుపోతుంది. పులి జీవిత కాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బెంగాల్‌ టైగర్లు అంతరించిపోతుంటే ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ద్వారా వాటిని పరిరక్షించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement